కట్టంగూర్, సెప్టెంబర్ 30 : చదువుతో పాటు సామాజిక బాధ్యతను చాటుకుంటూ కామినేని వైద్య కళాశాల ఎంబీబీఎస్ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. కామినేని వైద్య కళాశాల విద్యార్థులు అక్షిత్, అక్షయ్, ధీరజ్, పునీత్, ముఖేష్, వంశీకృష్ణ, రేవంత్, సాత్విక్ బుధవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.13 వేల విలువ చేసి వాటర్ కూలర్ డిస్పెన్సర్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి అంజయ్య మాట్లాడుతూ చదువుకునే వయసులోనే భావి వైద్యులు చూపిన ఈ సేవాభావం, చిన్నారుల ఆరోగ్యం పట్ల వారికున్న శ్రద్ధ ఎంతో అభినందనీయమన్నారు. ఇప్పటికే పాఠశాలలో శుద్ధి చేసిన తాగునీరు అందుతుండగా, ఈ వాటర్ కూలర్ ఏర్పాటుతో వేసవిలోనూ విద్యార్థులకు చల్లటి సురక్షిత నీరు అందుబాటులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, మహాలక్ష్మి, తేజస్విని, నీరజ, కనకదుర్గ, జయమ్మ, అంథోని పాల్గొన్నారు.