Mukesh Khanna | నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన నిరసనలకు మద్దతు తెలుపుతున్న వారిపై ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరసనలకు మద్దతు ఇచ్చినవారిని ఆయన ‘బొద్దింకలు’గా అభివర్ణించారు. విద్యార్థుల ముసుగులో కొందరు వ్యక్తులు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అజెండాతో ఈ ఆందోళనలను నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు.
తాను దేశంలో లేనప్పటికీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు యూట్యూబ్ ద్వారా పరిణామాలను గమనిస్తున్నానని ముఖేష్ ఖన్నా తెలిపారు. నీట్ పేపర్ లీక్ అనే అసలు సమస్యపై నిజంగా బాధపడుతున్న విద్యార్థులు కాకుండా, వేరే ఉద్దేశాలతో కొందరు రోడ్డెక్కి బూతులు మాట్లాడటం, అనుచితంగా ప్రవర్తించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నిరసనల పేరుతో కొందరు వ్యక్తులు యువతను పావులుగా వాడుకుంటూ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వారిని ఇళ్లలోని బొద్దింకలను బయటకు విసిరినట్లే సమాజం నుండి తన్ని తగలెయ్యాలని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ముఖేష్ ఖన్నా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనల పేరుతో వారు చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు వారి భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయని హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయని, పోలీసుల నుంచి లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందదని స్పష్టం చేశారు. కెరీర్ నాశనం కాకముందే విద్యార్థులు ఈ వివాదాల నుంచి బయటపడాలని ఆయన హితవు పలికారు.