మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30: ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందడంలేదని ఆరోపిస్తూ తన తల్లిని వీల్‌చైర్‌పై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి తీసుకెళ్లి నిరసన తెలిపిన కొడుకు ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బుధవారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. బాధితుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగుకు చెందిన భూక్యా బుజ్జి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నది.
మంగళవారం అర్ధరాత్రి ఆమె అస్వస్థతకు గురవడంతో కుమారుడు రాజ్‌కుమార్ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానకుకు తీసుకువచ్చాడు. దవాఖాన సిబ్బంది స్పందించలేదని, కనీసం బెడ్ కూడా కేటాయించలేదని రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రశ్నించినందుకు దవాఖాన సిబ్బంది తనపైనే దాడి చేశారని ఆరోపించాడు. తీవ్ర ఆవేదనకు గురైన రాజ్‌కుమార్ అదేరాత్రి తన తల్లిని అక్కడే ఉన్న వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని తోసుకుంటూ ప్రభుత్వ దవాఖాన నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి వెళ్లాడు.
విషయం తెలుసుకున్న ప్రభుత్వ దవాఖాన ఆర్ఎంవో శ్రీధర్ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని.. బాధితులతో మాట్లాడి బుజ్జిని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై ఆర్‌ఎంవోను వివరణ కోరగా రోగికి దవాఖానలో చికిత్స అందించడంలో ఎలాంటి జాప్యం చేయలేదని, రోగి కుమారుడు దవాఖా న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడినట్టు ఆర్ఎంవో తెలిపారు. అత్యవసర డయాలసిస్ అవసరం ఉండటంతో హయ్యర్ సెంటర్‌కు రెఫర్ చేయాలని సూచించామని, ప్రస్తుతం ఆమెను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎం జీఎంకు తరలించినట్టు వెల్లడించారు.