పారిస్ : బడుల్లో మెరుగైన సదుపాయాలను డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్‌లో విద్యార్థులు మంగళవారం నిరసన ప్రదర్శనలు చేశారు. చెత్త బుట్టలకు నిప్పు పెట్టి పోలీసులపైకి వస్తువులను విసిరేశారు. దీంతో పోలీసులు వారిపై బాష్ప వాయువును ప్రయోగించారు. టైమ్‌టేబుల్, తరగతికి ఉండాల్సిన విద్యార్థుల సంఖ్య, టీచర్ల కొరత, ఉక్కపోతగా ఉన్న తరగతి గదులు తదితర సమస్యలపై వారం రోజుల నుంచి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మొదట పారిస్ చుట్టుపక్కల ప్రారంభమైన ఈ నిరసనలు ఆ తర్వాత దేశంలోని నగరాలన్నింటికీ విస్తరించాయి. దేశ వ్యాప్తంగా మూడు లక్షల మంది నిరసన కవాతుల్లో పాల్గొన్నారని సంఘాలు తెలిపాయి. ‘నగర శివార్లకు చెందిన మేము నిర్లక్ష్యానికి, విస్మరణకు గురయ్యాం. ఇక్కడ పరిస్థితులు అపరిశుభ్రంగా ఉన్నాయి’ అని విక్టోయిర్ (16) అనే విద్యార్థిని విమర్శించింది. విద్యాశాఖ ప్రకారం దేశ వ్యాప్తంగా నిరసనల వల్ల 400 స్కూళ్లు ప్రభావితమయ్యాయి. 440 మందిని అదుపులోనికి తీసుకొన్నట్టు హోం శాఖ మంత్రి లారెంట్ తెలిపారు.