PL 2026 : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలైంది. బుధవారం సాయంత్రం బీసీసీఐ తాజా షెడ్యూల్ విడుదల చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ నెల 28 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ప్రారంభ వేడుకల అనంతరం జరిగే తొలి మ్యాచులో.. గత ఏడాది కప్ గెలిచిన బెంగళూరు (ఆర్సీబీ) జట్టు, హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు తలపడనున్నాయి.
ఐపీఎల్ రెండో మ్యాచ్ ముంబై, కోల్‌కతా మధ్య ఈ నెల 29న, మూడో మ్యాచ్ రాజస్థాన్, చెన్నై మధ్య ఈ నెల 30న జరుగుతుంది. మరోవైపు, బెంగళూరు, చిన్నస్వామి స్టేడియానికి సంబంధించి నిపుణుల కమిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 13న దీనిపై నిర్ణయం వెలువడుతుంది. సానుకూల నిర్ణయం వస్తేనే ఇక్కడ మ్యాచులు జరుగుతాయి. లేకుంటే ఓపెనింగ్ మ్యాచ్ సహా ఇతర మ్యాచుల్ని ఈ స్టేడియం నుంచి మరో వేదికకు మారుస్తారు. గత ఏడాది ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ స్టేడియంలో మళ్లీ మ్యాచుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సీజన్‌కు సంబంధించి ప్రస్తుతానికి ఏప్రిల్ 12 వరకు జరిగే మ్యాచుల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మ్యాచుల నిర్వహణ విషయంలో భద్రతాపరమైన సమస్యలున్నాయి. అందువల్ల బీసీసీఐ పూర్తి ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించలేదు.