Vegetables | పటాన్ చెరు, అక్టోబర్ 30 : ప్రకృతి, విపత్తులతో రైతులు సాగు చేస్తున్న కూరగాయలకు తీవ్ర నష్టం జరగడంతో మార్కెట్లో ధరలు ఆకాశానంటుతున్నాయి. మొంథా తుఫాను వల్ల భారీ వర్షాలు కురవడంతో రైతులు సాగు చేస్తున్న కూరగాయలకు నష్టం జరిగింది. మార్కెట్లో అన్ని సరుకులు ధరలు పెరిగినయి. ఏమీ కొనే పరిస్థితి లేదని పేదలు, కార్మికులు, కూలీలు నిరాశ చెందుతున్నారు. ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పెరిగిన ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
కూరగాయ ధరలు ఒకేసారి పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టమాట కిలో రూ. 60, రూ. ఆలుగడ్డలు రూ. 40, పాలకూర రూ. 60, కాకరకాయ రూ. 60, బీరకాయ రూ. 70, వంకాయ రూ. 60, బెండకాయ రూ. 60, దొండకాయ రూ. 50, క్యాప్సికం రూ. 100, క్యారెట్ రూ. 60, మిరపకాయ రూ. 60, గోరుచిక్కుడు రూ. 80, మార్కెట్లో కిలో ధరలు ఇలా ఉన్నాయి. రూ.50 తక్కువగా కూరగాయల ధరలు లేవు.
జేబులో రూ.100 నోటు పెట్టుకుని వెళ్తే పట్టుమని రెండు కూరగాయలు ఇంటికి పట్టుకరాని పరిస్థితి నెలకొంది. ఒక వారానికి కావాల్సిన కూరగాయలు మార్కెట్ నుంచి ఇంటికి తీసుకురావాలంటే రూ.600 ఖర్చు చేయవలసిన పరిస్థితి నెలకొంది. మార్కెట్లో కూరగాయల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
పటాన్ చెరు మార్కెట్కు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూరగాయలు దిగుమతి ..!
పటాన్ చెరు కూరగాయల మార్కెట్ కు ప్రతిరోజు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూరగాయలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో రవాణా ఖర్చులు అధికమై ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయలు సాగు చేయడంలో రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. కూరగాయల సాగు ప్రశ్నార్థకంగా మారిపోయింది.
కూరగాయలు సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించడంలో విఫలమవుతుంది. ఉద్యాన శాఖ ఉన్న కూరగాయల సాగుపై రైతులను ప్రోత్సహించడం లేదు. ఉల్లిగడ్డలు ప్రతిరోజు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. పటాన్ చెరు, జిన్నారం, గుమ్మడిదల ప్రాంతంలో రైతులు అధికంగా కూరగాయలు సాగు చేసేవారు. రైతులు సాగు చేయడం తగ్గించడంతో వ్యాపారులు క్యారెట్, క్యాప్సికం, వంకాయ, బెండ, టమాటా, ఉల్లిగడ్డ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పచ్చిమిర్చి, బీన్స్, ముల్లంగి, బీరకాయ, అల్లం, క్యాబేజీ, కాకర, చిక్కుడుకాయలు, ఉల్లిగడ్డలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రైతులు సాగు చేసుకుంటున్న కొద్ది పంటకు సైతం ముసురు వర్షంతో తీవ్ర నష్టం జరుగుతుంది.
మొంథా తుపానుతో కూరగాయలకు నష్టం..?
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫానుతో భారీ వర్షాలు కురవడంతో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వర్షాల కారణంగా 60 నుంచి 70 శాతం పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గిపోవడంతో మార్కెట్లో ధరలు అమాంతంగా పెరిగినాయి.
పెరిగిన ధరలు సామాన్యులను అతలాకుతులం చేస్తున్నాయి. కూరగాయల ధరలు పెరిగిపోవడంతో మార్కెట్లో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రతిరోజు వంటల్లో ఉపయోగించే టమాటా ధర పెరిగిపోవడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
సామాన్యుడి ఇంట్లో కూరగాయల ధరల వల్ల మంటలు వెలిగే పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగైదు రోజులుగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు పప్పు పులుసు తినే పరిస్థితి నెలకొంది. పచ్చిమిర్చి ధర పెరిగిపోవడంతో సామాన్యులు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్కెట్లో కూరగాయల ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Hot Fish Curry: భార్య ముఖంపై వేడి చేపకూర చల్లిన భర్త
Quality Seeds | నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి .. రైతులకు అవగాహన