MLA Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి 18 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను మాత్రమే కొంటామని కఠినమైన నిర్ణయాలు పెట్టింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎకరాకి 28 నుండి 32 క్వింటాళ్ల మొక్కజొన్న పంట పండుతుంది. ఆ 18 క్వింటాళ్ల పంటను కూడా భూమి యజమాని వెళ్ళి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం, కౌలు రైతుల పంట తీసుకోమని రూల్స్ పెట్టారు. 18 క్వింటాళ్ల పంటను మాత్రమే కొంటే మిగతా 12 క్వింటాళ్ల పంటను రైతులు ఏం చేయాలి? భూ యజమాని అందుబాటులో లేకుంటే కౌలు రైతుల పంటను కొనుగోలు చేయరా? ఇలాంటి నిర్ణయాలతో రైతులను ఈ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు.
తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండురోజులుగా మొoథా తుఫాన్ వల్ల రాష్ట్రంలో అనేక జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అన్ని రకాల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పశువులు, గొర్రెలు, మేకలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. సీఎం ,మంత్రులకు ఈ నష్టం గురించి తెలుసా..? తెలియదా..? అని నిలదీశారు. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో మొక్క జొన్న పంట ఆరున్నర లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. నాలుగు లక్షల ఎకరాల్లో మొక్క జొన్న దెబ్బతిన్నది. మొక్క జొన్న ఎకరాకు 30 క్విoటాళ్ల పంట పండుతుంది. ప్రభుత్వం మాత్రం ఎకరాకు 18 క్విoటాళ్ళ తీసుకుంటామని చెబుతుంది. కౌలు రైతుల నుంచి పంట కొనుగోలు చేసేది లేదంటున్నారు. మక్కలపై ఇదేమి పాలసీయో అర్థం కావడం లేదు. వెంటనే రైతులు పండించిన పంటనంతా కొనుగోలు చేయాలి. క్విoటాల్కు రూ. 2400 మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా రూ. 1800 కూడా రావడం లేదు. 11 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేస్తామని చెప్పి 11 వేల టన్నులు కూడా కొనుగోలు చేయలేదు. సోయాబీన్ కూడా ఒక క్విoటాల్ కొనుగోలు చేయలేదు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
పత్తి రైతుల భాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తేమ శాతం 11కు తగ్గించడం వల్ల ఏ రైతు పత్తి పంటను కొనుగోలు చేయడం లేదు. తేమ శాతం 17 ఉన్నా కొనుగోలు చేసేలా సీసీఐని రాష్ట్రప్రభుత్వం ఒప్పించాలి. ఇక వరి ధాన్యం విషయంలో నాలుగు వేల కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరవలేదు. చాలా మంది మిల్లర్లతో ఇంకా కొనుగోలు ఒప్పందాలు కూడా జరగలేదు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక ధాన్యం తడిసి పోయింది. కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే పల్లా ధ్వజమెత్తారు.
జనగాం జిల్లా నర్మెట్టలో 80 మేకలు వరదల్లో కొట్టుకుపోయాయి. అనేక విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. హన్మకొండలో 125 కాలనీలు నీట మునిగాయి. ఇంత జరుగుతున్నా సీఎం, మంత్రుల్లో చలనం లేదు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేదు. గత సంవత్సరం నష్టపోయిన పంటలకు రైతులకు ఇంకా నష్ట పరిహారం ఇవ్వలేదు. సీఎం సినిమా వాళ్ళతో చిందులు వేస్తున్నారు. సీఎం, మంత్రులు అందరూ జూబ్లీహిల్స్ మీద దృష్టి పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు వరద భాధిత ప్రాంతాల్లో పర్యటించకుండా జూబ్లీహిల్స్లో రౌడీలతో కలిసి ఓటర్లను బెదిరిస్తున్నారు. ఓ మంత్రి తన జన్మదిన వేడుకల్లో బిజీగా ఉన్నారు. చివరకు ఆ మంత్రి సమ్మక్క సారక్క దేవాలయ అభివృద్ధి పనుల టెండర్లను కూడా వదల్లేదు. మంత్రులు టెండర్లు దక్కించుకోవడంలో బిజీగా ఉన్నారు. ప్రజా సంపదను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంలో ఈ ప్రభుత్వం తలమునకలైంది. రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండా వేరే పనులకు ఈ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేస్తోంది. బందిపోట్లలా సీఎం, మంత్రులు రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు. జనగాంలో 95 లక్షలతో పూర్తయ్యే గానుగ పాడు బ్రిడ్జిని రిపేర్ చేయని అసమర్ధుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వేరే పనులు ఆపి వరద భాదితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలి అని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.