సిటీబ్యూరో: హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గంలో పరిహారంపై నాన్చుతున్న సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బాధితులకు ఇచ్చే పరిహారంలో వ్యత్యాసం ఉందనే నేపథ్యంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లా పరిధిలోనూ ఒకే రీతి పరిహారం ఉండాలనే డిమాండ్ చేస్తున్నారు. 200 ఫీట్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు వెడల్పును 120 ఫీట్లకు తగ్గించడం ద్వారా వంశపారంపర్యంగా జీవనాధారమైన భూములు, ఆస్తులు కొంతమేర అయినా మనుగడలో ఉంటాయన్న బాధితుల వాదనలను కూడా సర్కారు పట్టించుకోవడంలేదు. ఇకపై ఈ విషయంలో బాధితుల ప్రమేయం లేకుండా నోటీసులు, బలవంతపు భూసేకరణకు కార్యాచరణ అమలు చేయాలనే లక్ష్యంతోనే అధికారులు ఉండాలని సర్కారు ఆదేశించినట్లు సమాచారం.
17 కిలోమీటర్ల పొడవైన..
17 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గం వరకు దాదాపు 1500కు పైగా ఆస్తులు నష్టపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం రెండు వందల ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరించాలనే ప్రతిపాదనే కారణం. ఇదే విషయంలో గడిచిన ఏడాదిన్నర కాలం బాధితులు రోడ్డెక్కుతున్న పట్టించుకోని సర్కారు.. భూములు మాత్రం సేకరించాలని కంకణం కట్టుకున్నది. ఈ క్రమంలో గుర్తించిన ఆస్తులను సేకరించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సర్కారు… పరిహారం తేల్చకుండా ఇన్నాళ్లు జాప్యం చేసింది. తాజాగా మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రాంతాలకు ఒక రకంగా, హైదరాబాద్ జిల్లా వాసులకు మరో రకంగా పరిహారం ఇవ్వాలని చూస్తున్నది. దీనిపై పలువురు నిర్వాసితులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా..సర్కారు అమలు చేస్తున్న విభజించు పాలించు విధానాన్ని బాధితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఫ్లెఓవర్ 100 ఫీట్లే..
సర్కారు 200 ఫీట్ల మేర దూరంలో ఉన్న ఆస్తులను సేకరిస్తున్నది. కానీ ప్రాజెక్టును మాత్రం వంద ఫీట్ల మేరనే కట్టేందుకు టెండర్లు పిలవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫ్లైఓవర్ వెడల్పు కేవలం 100 ఫీట్లు ఉన్నప్పుడు ఇరువైపులా అదనంగా 50 ఫీట్ల వెడల్పుతో ఎందుకు ఆస్తులను సేకరిస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా పరిహారం విషయంలో మార్కెట్ ధరలకు మూడింతల చొప్పున చెల్లిస్తే తప్ప భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పినా కూడా..బాధితుల వాదనను సర్కారు వినిపించుకోవడం లేదు.
చర్చల్లేవు… ఆస్తుల సేకరణే
ఈ విషయంలో ఏడాది కాలంగా కాలయాపన చేస్తున్న సర్కారు.. బాధితులతో చర్చించేందుకు కూడా చొరవ తీసుకోవడం లేదు. విలువైన భూములు, ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బాధితులతో సయోధ్య కుదిర్చుకుని భూములు సేకరించే ఉద్దేశమే సర్కారుకు లేదు. దీంతో కనిపించిన ప్రతి నాయకుడికి వినిపించుకున్నా… తమ వాదనలు, అభిప్రాయాలకు పట్టింపు లేదని బాధితులు వాపోతున్నారు. కనీసం 100 ఫీట్ల రోడ్డు ఎందుకు అడుగుతున్నామనే స్పృహ కూడా సర్కారుకు లేదని, ఎంత సేపు 200 ఫీట్ల వెడల్పుతో భూములు సేకరించాలని, వాటికి పరిహారం అడ్డికి పావు శేరు చొప్పున కట్టబెట్టి చేతులు దులుపుకొనే లక్ష్యంతోనే సర్కారు అడుగులు వేస్తుందే తప్పా.. సామరస్యంగా బాధితులతో చర్చించి.. ఆస్తులు సేకరించే ఉద్దేశమైతే లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు.