కొల్లామ్: కేరళలో ఓ వ్యక్తి తన భార్య ముఖంపై వేడి వేడి చేప కూర(Hot Fish Curry)ను చల్లాడు. ఈ ఘటనలో బాధితురాలు రజీలా గఫూర్ ముఖ్యం కాలింది. తీవ్ర స్థాయిలో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే. రజీలా కొన్నాళ్ల నుంచి ఆరోగ్యంగా లేదు. ఆమెకు సైతాన్ పట్టినట్లు భర్త అనుమానించాడు. దీంతో ఓ ముస్లిం మంత్రగాడి వద్దకు వెళ్లాడు భర్త సాజీర్. అతను చెప్పినట్లు భార్యకు తాయత్తు కట్టి, విబూది పెట్టే ప్రయత్నం చేశాడు. భార్య కురులు విప్పి ఆమెకు విబూది ధరించాలని మంత్రగాడు చెప్పాడు.
మంత్రగాడు చెప్పినట్లు భార్యకు తాయత్తు కట్టే ప్రయత్నం చేశాడు భర్త. కానీ ఆ సమయంలో రజీలా తన భర్త మాటలు వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సాజీర్ .. ఆవేశంతో కిచన్లో ఉడుకుతున్న చేప కూరను తెచ్చి భార్య ముఖంపై పోశాడు. దీంతో ఆమెకు సుమారు 11 శాతం ముఖం కాలినట్లు తెలిసింది. ఆమె అరుపులు వినబడడంతో.. స్థానికులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తన భార్యకు దెయ్యం పట్టిందని పలుమార్లు ఆమెపై దాడి చేశాడు భర్త.
ఇదే విషయంలో గతంలో భార్య రజీలా పోలీసుల్ని ఆశ్రయించింది. కానీ భర్త మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఆంచల్లో ఉన్న ఉస్తాద్ అనే మంత్రగాడి వద్దకు భర్త వెళ్లినట్లు చెప్పిందామె. బీఎన్ఎస్లోని సెక్షన్ 118(1) కింద కేసు బుక్ చేశారు.