న్యూఢిల్లీ : ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచంపై భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పర్యవసనాలు అనివార్యమైనప్పటికీ యుద్ధం కొనసాగిన పక్షంలో భారత్‌పై కూడా దీని ప్రభావం పడనుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తిన వేళ చమురు ధరలు, ట్యాంకర్ల రవాణాను విధాన నిర్ణేతలు నిశితంగా గమనిస్తున్నారు. అయితే ఆర్థిక దుష్ప్రభావంపై ఇప్పుడే అంచనా వేయలేమని వారు తెలిపారు. తక్షణ ప్రభావం ఇంధన ధరలపై ఉండే అవకాశం ఉందని అంచనా. చమురు, గ్యాస్ దిగుమతిపై భారత్ అధికంగా పడి ఉండడమే ఇందుకు కారణం. పైగా పశ్చిమాసియా మీదుగానే అత్యధికంగా వీటి రవాణా జరుగుతున్నది. ముడి చమురు ధరలు పెరిగిన వెంటనే దాని ప్రభావం నేరుగా వినియోగదారులు, వ్యాపార సంస్థలపై పడుతుంది. కాగా, షేర్ మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.91.32కి చేరుకుంది.
పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ముడి చమురు ధరల పెరుగుదల, సరఫరాలో ఆటంకాలు, డిమాండుకు తగ్గట్టు దిగుమతులు ఉండకపోవడం వంటి పర్యవసనాలు తలెత్తే అవకాశం ఉందని ప్రధాన వినిమయ వస్తువుల కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక, వ్యూహాత్మక పర్యవసనాలను భారత్ ఎదుర్కొనే అవకాశం ఉంది. హోర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చుడి చమురు, ఎల్ఎన్జీ దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.దీనివల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఇంధనల ధరలు పెరిగిపోవచ్చు. హోర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే చమురు సరఫరాకు అవరోధం ఏర్పడుతుందన్న భయంతో ఇప్పటికే 10 శాతం ముడి చమురు ధరలు పెరిగాయి.
అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలు, ఇరాన్ ప్రతీకార దాడుల దరిమిలా నౌకల రవాణా నిలిచిపోతే దాని ప్రభావం వాణిజ్యంపై ఉంటుంది. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది.
భారత్ నుంచి ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యంలో సగం సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈ, యెమెన్ వంటి దేశాలకే వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి గల్ఫ్ ప్రాంతానికి జరిగే 450 కోట్ల డాలర్ల ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ ఎగుమతులపై కూడా యుద్ధ ప్రభావం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌లో తయారయ్యే స్మార్ట్ఫోన్లకు రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా యూఏఈ ఉంది. యుద్ధం వారం రోజులు దాటితే పప్పుధాన్యాల ధరలు పెరుగుతాయని అఖిల భారత దాల్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్ అగర్వాల్ తెలిపారు. డిటర్జెంట్లు, బిస్కెట్లు, టూత్‌పేస్టులు, పెయింట్లు, ప్యాకేజింగ్ వస్తువులు వంటి ప్రతి నిత్య వినిమయ ఉత్పత్తుల తయారీలో ముడి చమురు, దాని ఉత్పన్నాలు కీలక భూమిక పోషిస్తాయి.