Heart Diseases | గుండె జబ్బులు అధిక బరువు ఉన్నవారికే వస్తాయనే అభిప్రాయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అయితే సన్నగా కనిపించే వ్యక్తులు కూడా గుండెపోటు బారిన పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. సాధారణ కొలెస్ట్రాల్ పరీక్షలో అన్నీ సాధారణంగానే ఉన్నా, గుండె సంబంధిత ప్రమాదం దాగి ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మొత్తం కొలెస్ట్రాల్ విలువను మాత్రమే చూసి గుండె ఆరోగ్యం బాగుందని భావించడం సరైన విధానం కాదని వారు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయాలంటే కొలెస్ట్రాల్‌తోపాటు శరీరంలో ఉండే వివిధ రకాల కొవ్వు కణాలు, వాపు (ఇన్ఫ్లమేషన్) స్థాయి, జన్యుపరమైన ప్రమాద కారకాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. సాధారణ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల్లో ఈ వివరాలన్నీ కనిపించవు. అందుకే కొందరిలో సాధారణ రిపోర్టులు వచ్చినప్పటికీ గుండెపోటు వచ్చే ప్రమాదం కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో లిపోప్రోటీన్ (ఎ) లేదా ఎల్పీ(ఎ) ఒకటి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్‌ను మోసుకెళ్లే ప్రత్యేక లిపోప్రోటీన్. దీని స్థాయి ఎక్కువగా ఉండటం ప్రధానంగా జన్యుపరమైన కారణాల వల్ల జరుగుతుంది. ఎల్పీ(ఎ) అధికంగా ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా సన్నగా కనిపించే వ్యక్తుల్లో శరీరం బయటకు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉండే అవకాశం ఉంది. అలాంటి వారిలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ట్రైగ్లిసరైడ్లను కూడా గుండె ఆరోగ్యానికి కీలక సూచికగా పరిగణిస్తారు. ఇవి రక్తంలో ఉండే అత్యంత సాధారణ కొవ్వు రూపం. శరీరానికి అవసరం లేని అదనపు క్యాలరీలను ట్రైగ్లిసరైడ్ల రూపంలో నిల్వ ఉంచి, అవసరమైనప్పుడు శక్తిగా ఉపయోగిస్తుంది. అయితే శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు, అధిక చక్కెరలు తీసుకునే అలవాటు వల్ల సన్నగా ఉన్న భారతీయుల్లో కూడా ట్రైగ్లిసరైడ్ల స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఇవి ఇన్సులిన్ నిరోధకతతో కూడా సంబంధం కలిగి ఉండటంతో గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుంది.
స్మాల్, డెన్స్ ఎల్డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ కణాలు కూడా ప్రమాదకరమైనవిగా చెప్పవచ్చు. సాధారణ ఎల్‌డీఎల్‌తో పోలిస్తే ఇవి పరిమాణంలో చిన్నగా ఉండటంతో రక్తనాళాల గోడల్లో సులభంగా పేరుకుపోయి ఫలకాలు ఏర్పడే అవకాశాన్ని పెంచుతాయి. దీంతో గుండెపోటు ప్రమాదం అధికమవుతుంది. హెచ్‌డీఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం కూడా మరో ప్రమాద సూచిక. హెచ్‌డీఎల్ రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. దక్షిణాసియా ప్రజల్లో, ముఖ్యంగా భారతీయుల్లో బరువు సాధారణంగా ఉన్నప్పటికీ హెచ్‌డీఎల్ స్థాయి తక్కువగా ఉండటం తరచూ కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. సన్నగా కనిపించే భారతీయుల్లో కూడా గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉండడానికి థిన్-ఫ్యాట్ ఇండియన్ ఫినోటైప్ అనే పరిస్థితి కారణమవుతుంది. ఇందులో శరీర బరువు తక్కువగా ఉన్నప్పటికీ అంతర్గత అవయవాల చుట్టూ విస్సరల్ ఫ్యాట్ అధికంగా పేరుకుపోతుంది. బయటకు ఆరోగ్యంగా కనిపించినా లోపల గుండె, జీవక్రియలపై ప్రభావం చూపే మార్పులు జరిగి ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కూర్చునే జీవనశైలి, అధిక కార్బొహైడ్రేట్ ఆహారం కూడా తోడైతే ప్రమాదం మరింత పెరుగుతుంది.
గుండె సమస్యలను సూచించే కొన్ని హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉండటం, ట్రైగ్లిసరైడ్ల స్థాయి సరిహద్దు స్థాయిలో ఎక్కువగా ఉండటం, తరచూ అలసట, తక్కువ శక్తి, బరువు తక్కువగా ఉన్నప్పటికీ పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే పూర్తి స్థాయి గుండె పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ కొలెస్ట్రాల్ పరీక్షతో పాటు కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంపై మరింత స్పష్టమైన సమాచారం పొందవచ్చు. ఇందులో లిపోప్రోటీన్ (ఎ) పరీక్ష, అపోలిపోప్రోటీన్-బి (ApoB) పరీక్ష, ట్రైగ్లిసరైడ్స్-టు-హెచ్‌డీఎల్ నిష్పత్తి పరీక్ష, అలాగే శరీరంలో వాపు స్థాయిని గుర్తించే హెచ్ఎస్-సీఆర్పీ (Hs-CRP) పరీక్షలు ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే జీవనశైలిలో మార్పులు కూడా అవసరం. ఆహారంలో నాణ్యమైన ప్రోటీన్‌ను పెంచడం, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెర పదార్థాలను తగ్గించడం, క్రమం తప్పకుండా కార్డియో వ్యాయామాలు, కండరాల బలం పెంచే వ్యాయామాలు చేయడం, అవసరమైనప్పుడు అడ్వాన్స్డ్ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, ఒత్తిడిని నియంత్రించుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కేవలం సాధారణ కొలెస్ట్రాల్ రిపోర్టు ఆధారంగా గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సన్నగా ఉన్న భారతీయులు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఇతర లిపిడ్లు, జన్యుపరమైన ప్రమాద కారకాలు, వాపు సూచికలపై కూడా దృష్టి పెట్టాలి. సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.