Karnataka : కర్ణాటకలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక, మైసూరు జిల్లా, హున్సూర్ పట్టణ పరిధి, న్యూ మారుతి లేఔట్లో మంగళవారం జరిగింది. మృతులను హరీష్ (39), అతడి భార్య నిశ్చిత (37), పిల్లలు రక్ష (8), నక్ష (4)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. హరీష్ ముందుగా తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. అనంతరం తాను పై ఫ్లోర్‌లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హరీష్ ఒక ఇన్సూరెన్స్ సంస్థలో వెహికల్ రికవరీ యూనిట్లో పని చేస్తున్నాడు. అతడు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హరీష్ ఇంటికి వెళ్లి చూడగా వారి మృతదేహాలు లభించాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని బెడ్‌పై నిశ్చిత, ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలు పడి ఉన్నాయి. వారి ఒంటిపై టేప్ చుట్టి ఉంది. అక్కడే వారికి సూసైడ్ లేఖ దొరికింది. అందులో తాను పై ఫ్లోర్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు పొందుపరిచిన డాక్యుమెంట్ వివరాల్ని కూడా అందులో పేర్కొన్నాడు.
వాటిని ఒక వ్యక్తికి ఇవ్వాలని, ఇదే తన ఆఖరి కోరిక అని సూసైడ్ లేఖలో కోరాడు. ఆత్మహత్య చేసుకోవడానికి మూడు రోజులు ముందు తన తల్లిని అమ్మమ్మ వాళ్ల ఇంటికి పంపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా, లేక కుటుంబ కలహాలున్నాయా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.