న్యూఢిల్లీ,సెప్టెంబర్ 18: డెంగ్యూ నివారణకు తొలి టీకా ‘క్యూడెంగ్యూ’ వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో దేశీయంగా అందుబాటులోకి రాబోతున్నది. ఇందుకోసం జపాన్‌కు చెందిన టకెడా ఫార్మాస్యూటికల్ కంపెనీ… డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌తో శుక్రవారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దేశంలోని ప్రైవేట్ మార్కెట్లో ఈ టీకాను డాక్టర్ రెడ్డీస్ దేశీయంగా పంపిణీ చేయనుంది. స్థానిక అధికారిక ప్రక్రియలు పూర్తైన తర్వాత 2027 ప్రథమార్ధంలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. క్యూడెంగ్యూ టీకాకు కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రెడ్డీస్ గ్లోబల్ జనరిక్ సీఈవో ఎంవీ రమణ మాట్లాడుతూ.. దేశంలో రెండో అతిపెద్ద వ్యాక్సిన్, తొలి ఆమోదిత డెంగ్యూ వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టడం దేశీయ ఆరోగ్య సంరక్షణ రంగానికి ఒక కీలక పరిణామమన్నారు. టకెడా ఫార్మాతో కుదుర్చుకున్న ఒప్పందంతో అర్హులైన వ్యక్తులకు క్యూడెంగ్యూను అందుబాటులోకి తీసుకురావడానికి, దేశంలో డెంగ్యూ భారాన్ని తగ్గించే ప్రయత్నాలకు తోడ్పాటునందించడానికి వీలు పడనున్నదన్నారు. టకెడా ఇంటర్నేషన్ బిజినెస్ హెడ్ మహేందర్ నాయక్ మాట్లాడుతూ..రెడ్డీతో కుదుర్చుకున్న ఒప్పందంతో భారత్‌లో తమ తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌ను విడుదల చేయడానికి లైన్‌క్లియర్ అయిందని, ఇప్పటికే 43 దేశాల్లో 32 మిలియన్ల డోస్‌లను డిస్ట్రిబ్యూట్ చేసినట్టు చెప్పారు.
ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో చిన్నారులు, పెద్దలకు టీకాను అందించేందుకు ఏర్పాట్ల చేస్తున్నారు. భారత్‌లో డెంగ్యూ కేసులు గత రెండు దశాబ్దాల్లో 11 రెట్లు పెరిగినట్లు సంస్థలు పేర్కొన్నాయి. గతంలో డెంగీ సోకినవారు, ముందస్తు పరీక్షలు అవసరం లేకుండానే ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చును. నాలుగు రకాల్లో డెండగీ వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించిన క్యూడెంగా టీకా.. 4 నుంచి 40 ఏండ్ల వయసున్న వారు మూడు నెలల వ్యవధిలో 0.5 ఎంఎల్ చొప్పున రెండు మోతాదుల్లో ఈ టీకా వేసుకోవాల్సివుంటుంది.