మరాఠీ థ్రిల్లర్ ‘గోంధల్’ 2027 ఆస్కార్ పురస్కారాల కోసం భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఖరారైంది. శుక్రవారం ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. సంతోష్ దవాఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 99వ ఆస్కార్ అవార్డ్స్ బరిలో ‘ఉత్తమ విదేశీ చిత్రం’ కేటగిరీలో పోటీ పడనుంది. వివిధ భారతీయ భాషల నుంచి మొత్తం 33 చిత్రాల్ని పరిశీలించిన జ్యూరీ చివరకు ‘గోంధల్’ను ఆస్కార్ బరిలో నిలపాలని నిర్ణయించింది. తెలుగు నుంచి ‘సింగ్ గీతం’ ‘పెద్ది’ ‘ఇరుముడి’ ‘ఇగ్వా’ (ఇంకా విడుదల కాలేదు) కమిటీ స్క్రీనింగ్‌కు వెళ్లాయి. హిందీ నుంచి ‘120 బహదూర్’ ‘బోర్డర్-2’ ‘ధురంధర్’ ‘ధురంధర్: ది రివేంజ్’ ‘ఇక్కీస్’ ‘హనుమాన్ అంశ్’ చిత్రాలు పరిశీలనకు వచ్చాయి.
‘గోంధల్’ కథ గురించి..
మహారాష్ట్ర సంప్రదాయ జానపద కళారూపమైన ‘గోంధల్’ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ వివాహిత మహిళ జీవితంలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాల చుట్టూ కథ నడుస్తుంది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో మొదలయ్యే ఈ కథ అనుకోకుండా థ్రిల్లర్‌గా మలుపు తీసుకుంటుంది. ప్రేమ, కోరిక, మోసం అంశాలు ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓవైపు కుటుంబ కథతో పాటు శతాబ్దాల చరిత్ర ఉన్న ‘గోంధల్’ జానపద కళారూపాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు.
ఈ సంప్రదాయ కళకు ఆధునిక సమాజంలో ఉన్న స్థానం గురించి చర్చించారు. కిశోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేశ్ సోహోని తదితరులు చిత్ర తారాగణం. ఈ చిత్రం బెంగళూరు, పుణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శింపబడింది. ఇళయరాజా సంగీతాన్నందించిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.