నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 18 : మహాత్మాజ్యోతిబా ఫూలే కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. బల్మూర్ మండలం జినుకుంటకు చెందిన విద్యార్థి భరత్(16) ఈ నెల 12న కళాశాల నుంచి సొంతూరుకు వెళ్లాడు. ఈ నెల 15న తల్లిదండ్రులకు కళాశాల నుంచి ఫోన్ రాగా.. కాలేజీకి వెళ్లాలని తల్లి చెప్పడంతో అక్కడికి వెళ్లడం ఇష్టంలేని భరత్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం విష యం తెలుసుకున్న తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నాగర్‌కర్నూల్‌లోని శ్రీపురం చౌరస్తాలో ఆందోళనకు దిగారు.
కళాశాల అధ్యాపకులు ప్రభాకర్‌రెడ్డి, శంకర్ నిత్యం విద్యార్థులను వేధించేవారని, వారి టార్చర్‌తో భరత్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. విద్యార్థి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళాశాల నుంచి జిల్లా కేం ద్రానికి విద్యార్థులు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. భరత్ మృతికి కారణమైన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ, బీసీ సంఘం నాయకులు మరోసారి కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారుల హామీతో ఆందోళన విరమించారు.