హైదరాబాద్, సెస్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ బీ ఫారం మీద గెలిచారు, పార్టీ మారి అధికారపక్షం గూటికి చేరారు. అసెంబ్లీలోనూ అదే పక్షంవైపు కూర్చున్నారు, కార్యక్రమాల్లోనూ బాజాప్తా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఫొటోలకు పోజులు ఇచ్చారు. కానీ పదవికి మాత్రం గులాబీ పార్టీ గుర్తింపునే పట్టుకొని వేలాడుతున్నారు. అధికారికంగా ‘బీఆర్ఎస్ సభ్యులమే’ అంటూ దబాయిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో రెండున్నరేండ్లుగా సాగుతున్న తంతు ఇది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు ఆడుతున్న వికృత క్రీడ ఇది. ఈ ‘జంప్ జిలానీ’లకు హైకోర్టు దిమ్మతిరిగేలా ఝలక్ ఇచ్చింది. గోడదూకిన వాళ్లలో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటువేసింది. స్పీకర్ నిర్ణయాన్ని పకనబెట్టింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు స్పీకర్ ముందు తిరసరణకు గురైన మిగిలిన ఫిరాయింపు కేసులకు కూడా ఇదే తీర్పు వస్తుందా? అనే చర్చ మొదలైంది.
దానం నాగేందర్‌పై పడ్డ వేటు.. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి దూకిన మిగిలిన ఎనిమిదిమంది ఎమ్మెల్యేల మెడపై కత్తిలా వేలాడుతున్నది. ఇప్పటికే కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య (చేవెళ్ల), సంజయ్‌కుమార్ (జగిత్యాల), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల)పై అనర్హత పిటిషన్లు కోర్టుల పరిశీలనలో ఉన్నాయి. తెల్లం వెంకట్రావు అందరికన్నా ముందే జంప్ కాగా, లోక్‌సభ ఎన్నికల వేళ కూతురికి ఎంపీ టికెట్ కోసం కడియం గోడ దూకారు.
గతంలో స్పీకర్‌గా పనిచేసిన సీనియర్ నేత పోచారం కాంగ్రెస్‌లో చేరడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం వివాదాన్ని మరింత రాజేసింది. మిగిలినవారు సైతం ‘ప్రభుత్వ మద్దతు, నియోజకవర్గ అభివృద్ధి’ పేరుతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనేది బహిరంగ రహస్యం. దానం వ్యవహారంలో కోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో మిగతావారిపై కూ డా వేటు లాంఛనమే అని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గతంలో అధికార పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు స్పీకర్ వ్యవస్థ కాలయాపనను ప్రధాన అస్త్రంగా మార్చుకునేది. అనర్హత పిటిషన్లపై నోటీసులు ఇవ్వడం, సమాధానాలకు గడువు పొడిగించడం, విచారణల పేరుతో ఐదేండ్ల పదవీ కాలం పూర్తయ్యేవరకు నెట్టుకొచ్చే సంప్రదాయం నడిచేదని రాజకీయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత స్పీకర్ సైతం తొమ్మిది మంది అనర్హత పిటిషన్లపై మొదట్లో నాన్చుడు ధోరణి అవలంబించారన్న విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు గతంలో ‘కిహోతో హోల్లోహన్’ కేసుతోపాటు ‘సుభాష్ దేశాయ్ (మహారాష్ట్ర)’ కేసులో నిర్దిష్ట కాలపరిమితిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినా, తెలంగాణలో మాత్రం ప్రక్రియ మందకొడిగానే సాగింది. అయితే, దానం కేసులో కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతోపాటు గడువు నిర్దేశించి, ఫలితం తేల్చింది.
ఈ తరహా డ్రామా గతంలో పశ్చిమబెంగాల్లో కనిపించింది. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్‌రాయ్.. ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీర్థం పుచ్చుకున్నారు. ప్రభుత్వం ఆయనకు పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. దీనిపై బీజేపీ కోర్టుకెకింది. స్పీకర్ అధికారాలపై కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టు కఠినమైన వ్యాఖ్యలు చేశాయి. ఒక పార్టీ నుంచి గెలిచి, వేరే పార్టీ తరఫున లబ్ధి పొందు తూ, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని హెచ్చరించాయి. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే నేరుగా నిర్ణయం ప్రకటిస్తామని అల్టిమేటం జారీ చేశాయి. చివరికి ముకుల్ రాయ్ అనారోగ్య కారణాలతో పదవికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. బెంగాల్లో స్పీకర్ నిస్సహాయతను, అధికార పార్టీ నాటకాన్ని కోర్టు ఎలా బట్టబయలు చేసిందో.. తెలంగాణలోనూ అచ్చం అదే దృశ్యం పునరావృతం అయ్యిందని చెప్పుకుంటున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. 2024 మార్చి 15న కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అసెంబ్లీకి ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికై, కొద్దికాలానికే పార్లమెంట్ ఎన్నికల్లో మరో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌ను ఆశ్రయించారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాత్రం దానం పార్టీ మారినట్టు సరైన ఆధారాలు లేవని పిటిషన్లను కొట్టివేశారు.
తాను బీఆర్ఎస్ సభ్యుడినేనంటూ దానం సమర్పించిన 55 పేజీల అఫిడవిట్‌ను యథాతథంగా ఆమోదించారు. ఈ తీర్పుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. స్పీకర్ నిర్ణయాన్ని పకనబెట్టి, దానం నాగేందర్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన 2024 ఏప్రిల్ 23 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టేనని న్యాయ నిపుణులు పేర్కొన్నారు.