హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఆ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఒకటే ఆయన అనర్హతకు సరిపోతుందని సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అన్నారు. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద అనర్హతకు గురయ్యారని తెలిపారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నదని చెప్పడానికి హైకోర్టు తీర్పే నిరదర్శమని అన్నారు. దానంపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన అనంతరం హైకోర్టు గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరఫున వాదించిన గండ్ర మోహరావు మీడియాతో మాట్లాడారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చట్టసభ సభ్యులకు వెసులుబాటు కల్పించేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టులు అంగీకరించిన దాఖలాలు లేవని చెప్పారు. ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకొనేందుకు సుప్రీంకోర్టు గతంలోనే నిరాకరించిందని తెలిపారు. భూపతిరెడ్డి కేసులో తెలంగాణ హైకోర్టు అనర్హత వేటును సమర్థించగా.. దానిపై దాఖలైన అప్పీల్లో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని తెలిపారు. దానం నాగేందర్ కేసులోనూ అదే న్యాయసూత్రం వర్తిస్తుందని చెప్పారు. స్పీకర్ దానం నాగేందర్ అనర్హత పిటిషన్లను తిరసరిస్తూ ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు కొట్టివేయడం ద్వారా ఆ నిర్ణయంలోని తప్పిదాన్ని ఎత్తిచూపిందని అన్నారు.
రాజ్యాంగ ని బంధనలను, సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ తప్పుగా అర్థం చేసుకొని అనర్హత అంశంపై తీర్పు ఇచ్చారని, దీనిని హైకోర్టు కొట్టివేసిందని చెప్పారు. హైకోర్టు స్పీకర్ ఉత్తర్వును పకనపెట్టి దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించిందని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా తేల్చిందని తెలిపారు. ఈ ఉత్తర్వు ప్రతిని అసెంబ్లీ స్పీకర్‌కు, ఎన్నికల సంఘానికి పంపించాలని హైకోర్టు ఆదేశించిందని, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించే వరకు తీర్పును నిలిపివేయాలన్న దానం తరఫు అభ్యర్థనను కూడా హైకోర్టు అంగీకరించలేదని గుర్తుచేశారు.