న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 17తో ముగిసేనాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు 13 శాతం ఎగబాకి రూ.12.12 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వీటిలో కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 19.48 శాతం అధికమై రూ.5.56 లక్షల కోట్లకు చేరుకోగా, కార్పొరేటేతర పన్న వసూళ్లు ఆరు శాతం ఎగబాకి రూ.6.16 లక్షల కోట్లకు చేరాయి.
అలాగే సెక్యూరిటీస్ ట్రాన్సక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) వసూళ్లు 53 శాతం ఎగబాకి రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయి. కానీ, రూ.2.20 లక్షల కోట్ల రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపినట్టు సీబీడీటీ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 15 శాతం ఎగబాకి రూ.14.32 లక్షల కోట్లకు చేరాయి.