ఖైరతాబాద్ ఉపఎన్నిక తప్పదా
ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు.. ఓటేసి గెలిపించిన ప్రజలంటే లెక్కే లేదు.. నాలుగు దశాబ్దాల రాజకీయంలో ఒక్కటే పాలసీ! అదే అధికారం!! దాని కోసం ఏమైనా చేస్తారు.. విలువలకు పాతర వేస్తారు. అంగీలు మార్చినంత సులువుగా పార్టీ కండువాలు మార్చుతారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏకంగా నాలుగు సార్లు పార్టీ కండువాలు మార్చిన చరిత్ర దానం నాగేందర్ సొంతం. పైగా అధికారం వెనక పరుగులు పెట్టి బొక్కబోర్లా పడి ఉప ఎన్నిక ఎదుర్కోవడం.. దానం అధికార దాహాన్ని చీదరించుకొని ఓటర్లు తగిన గుణపాఠం చెప్పడం కొత్తేమీ కాదు.
ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌కు తాజాగా హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. గులాబీ జెండాతో గెలిచి.. ఓటరు వేలికి సిరా ఆరకముందే కాంగ్రెస్ కండువా కప్పుకొనడమే కాకుండా ఆ పార్టీ జెండాపై పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పార్టీ మారలేదంటూ బుకాయించారు. కానీ న్యాయస్థానం దిమ్మతిరిగే రీతిలో దానంపై వేటు వేయడంతో ఖైరతాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారే అవకాశాలున్నాయి. దీంతో ‘మనకు ఉపఎన్నిక అచ్చిరాదు కదా!’ అని జంపింగ్ జపాంగ్ అనుచరులు ఆందోళన చెందుతున్నట్లు చర్చ జరుగుతున్నది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నుంచి గోడ దూకి అధికార పార్టీ కండువా కప్పుకొన్న దానం నాగేందర్‌పై హైకోర్టు ససెన్షన్ వేటు వేయడం హైదరాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సందర్భంలో దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానంపైనా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా దానం నాగేందర్ ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ప్రతిసారీ అధికార కోసం వెంపర్లాడటం తప్ప.. ప్రజా సేవలో చిత్తశుద్ధిగా వ్యవహరించిన దాఖలాలు లేవనే ప్రచారం ఉంది. ఇందుకు బలాన్ని చేకూర్చేలా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దానం ఏకంగా నాలుగు పర్యాయాలు పార్టీ రంగులు మార్చడంపై నగర ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది. ఓట్లేసిన జనం సమస్యలు తీర్చేందుకు అధికారంలో ఉంటే కృషి… ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేయాల్సిన నాయకుడు ప్రజా సమస్యల్ని గాలికి వదిలి అధికారం కోసం ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పార్టీ కండువాలు మార్చడమేందని నగరవాసులు విమర్శిస్తున్నారు. పీజేఆర్ అనుచరుడిగా నగర రాజకీయాల్లోకి వచ్చిన దానం నాగేందర్ చివరకు ఆయన బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే పీజేఆర్ ప్రత్యర్థి అయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంచన చేరి ఆయన్ని మానసిక క్షోభకు కారణమయ్యాడనేది సీనియర్ నేతల విశ్లేషణ.
అంతేకాదు ఇప్పుడు పీజేఆర్ వారసుల అవకాశాలను కూడా కొల్లగొట్టడంలో ముందు వరుసలో ఉండి, పీజేఆర్‌పై వైఎస్ కక్ష సాధింపునకు ఒక పావుగా మారాడని పీజేఆర్ అనుచరులు ఇప్పటికీ వివరిస్తారు. తొలిసారిగా ఉమ్మడి ఏపీలో 1994లో ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం… ఆపై 1999 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో మూడు రంగుల జెండా వదిలి పచ్చ జెండా అయిన తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. ఆసిఫ్‌నగర్ నుంచి ఓటర్లు గెలిపించడంతో టీడీపీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే దానం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే పచ్చ జెండాను పక్కనపడేసి మళ్లీ మూడు రంగుల కండువా కప్పుకున్నాడు. అంతేకాదు… తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక సిద్ధమయ్యారు. అధికార పార్టీ తరపున ఆ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి పొందాలని పగటి కలలు కన్నారు. కానీ ఓటర్లు చాలా తెలివిగా వ్యవహరించారు. తమ వేలికి ఇంకు ఆరక ముందే కండువా మార్చుతావా… అంటూ ఆసిఫ్‌నగర్ ఉప ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. చిత్తుగా ఓడించడంతో అధికారం కోసం తాపత్రయపడిన నాగేందర్‌కు ఎమ్మెల్యే పదవే లేకుండా అసలు సీటుకే ఎసరు వచ్చింది.

ఉమ్మడి రాష్ట్రంలోనే 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ గెలుస్తుందనే గంపెడాశతో పోటీ చేసి, నిరాశ ఎదురుకావడంతో ఏం చేయాలో దిక్కు తోచలేదు. దీంతో 2018 ఎన్నికల సమయానికి మరోసారి జంప్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) పార్టీలోకి వచ్చి ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి, గెలుపొందారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున ఆ ఐదేండ్లు కుదురుగానే ఉన్నారు. గత ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నుంచి బరిలోకి దిగి మళ్లీ గెలిచారు. కానీ ఈసారి బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే… దానం నాగేందర్ తనలోని జంపింగ్ టాలెంట్‌కు మళ్లీ పని కల్పించారు. ఎలాగూ అలవాటైన పాణమే కదా… కేవలం మూడు నెలల వ్యవధిలోనే మళ్లీ గోడ దుంకారు. జనం నమ్మి గులాబీ జెండా మీద గెలిపిస్తే వాళ్ల ఆశల్ని అడియాసలు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
ముఖ్యంగా అధికారం కోసం దానం ఎంతకైనా దిగజారుతారనేది ఆ సందర్భంగా మరోసారి రుజువు చేశారు. ఒక పార్టీ కండువా మీద గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోవడమే తప్పయితే..దానం మాత్రం ఏకంగా మరో కండువా పార్టీ తరపున పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా రాజకీయ నిపుణులు అభివర్ణిస్తారు. అయితే దానం ఆశ ఒకలా ఉంటే ప్రతిసారీ కాలం తగిన గుణపాఠాన్ని చెబుతూనే ఉంది. అందుకే 2004 పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు ఓడించడంతో సానుభూతితోనైనా కాంగ్రెస్ తనకు మంత్రి పదవి ఇస్తుందని ఆశ పడ్డారు. గెలిస్తే హస్తిన… ఓడిపోతే బుగ్గకారు ఒప్పందంపైనే సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారనే ప్రచారం ఉంది. అయితే ‘కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తక్కువేమీ తినలేదు కదా… పైగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలనే తుంగలో తొక్కింది. ఇక దానంకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా! జనాన్ని దానం మోసం చేస్తే కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ని మోసం చేసింది. మంత్రి పదవి ఇవ్వకుండా మొండిచెయ్యి చూపింది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు.
అధికార దాహంతో పార్టీ మారితే చివరకు దానం దుస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందనేది ఆయన అనుచరుల అభిప్రాయమే. గత కొన్ని నెలలుగా దానం తరచూ చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఇందుకు బలాన్ని చేకూరుస్తాయి. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ ఓడిపోయింది మొదలు కాంగ్రెస్ అధిష్ఠానమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వమూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ఏ ఒక్క అధికారి కూడా ఆయన్ని ఖాతరు చేసిన సందర్భాలు లేవనేది అనేక వేదికలపై ఆయనే బహిరంగంగా చెప్పిన వాస్తవం. అందుకే ఎలాగూ జనంలో ప్రతిష్ఠ దెబ్బతిన్నందున ఉప ఎన్నిక వస్తే మళ్లీ ఆసిఫ్‌నగర్ అనుభవమే ఎదురవుతుందనే భయంతో చాలాకాలం వేటు పడకుండా నానా తంటాలు పడుతూ వస్తున్నారు.
చివరకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆధారాలు ఉన్నప్పటికీ తాను పార్టీ మారలేదంటూ పదేపదే వ్యాఖ్యానించడంతో పాటు ఇటీవలి కాలంలో కేసీఆర్, కేటీఆర్‌లను ప్రశంసించడం మొదలుపెట్టారు. కానీ ఇవేవీ దానంను హైకోర్టు వేటు నుంచి కాపాడలేకపోయాయి. ఎట్టకేలకు శుక్రవారం హైకోర్టు సంచలన తీర్పునిస్తూ దానంపై వేటు వేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాకపోతే దానంకు ఉప ఎన్నిక అందునా అధికారం కోసం పాకులాడేందుకు ఎదుర్కొనే ఉప ఎన్నిక అసలే అచ్చిరాదనే ఆందోళన మాత్రం ఆయన, అనుచరులను తీవ్రంగా వెంటాడుతూనే ఉంది.