హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాల తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను బుధవారం అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. అనంతరం ఆయన్ను విశాఖలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరుచగా రిమాండ్ విధించినట్టు తెలిపింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు.. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో క్రిమినల్ కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి కోణాలు ఉన్నట్టు తేల్చారు.
రిఫైన్డ్ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయి ల్, పామోలిన్తోపాటు ఎంజీ-90, మోనోగ్లిజరైడ్స్, మైవాసెట్ సాఫ్ట్ 400, ఎసిటిక్ యాసిడ్ లాంటి ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని, ‘అగ్ మార్ స్పెషల్ గ్రేడ్ కౌ ఘీ’గా ముద్రవేసి టీటీడీకి అంటగట్టారని గుర్తించారు. 2019-24 మధ్యకాలంలో సరఫరా చేసిన కల్తీ నెయ్యి విలువ సుమారు రూ.230 కోట్లు ఉంటుందని అంచనావేశారు. ఇందులో కైలాష్చంద్ రూ.96 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు దర్యాప్తులో తేలింది.