న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: పెరుగుతున్న ముడి చమురు ధరలు, ఎల్ నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో భారత్‌కు ద్రవ్యోల్బణం ప్రమాదం ఉన్నదని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య తగ్గినట్టే తగ్గి.. మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి మరి. బ్యారెల్ 100 డాలర్లను దాటేసింది. దీంతో మెజారిటీ ఇంధన అవసరాలను దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్న భారత్‌కు అధిక ధరల సెగ గట్టిగానే తగులుతున్నది.
మిడిల్ ఈస్ట్‌లో మరోసారి ఉద్రిక్తకర వాతావరణం నెలకొనగా.. ఇంధన ఉత్పత్తి, సరఫరాలకు అది ఆటంకంగా మారింది. ఈ వార్‌లో అమెరికాకు మద్దతిస్తున్నాయంటూ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగుతుండటం, కీలకమైన హొర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకల రాకపోకలకు ఇబ్బందులు సృష్టిస్తుండటం.. భారత్ సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నది. ఈ క్రమంలోనే తాజా మూడీస్ హెచ్చరికలు వచ్చాయి.
ఇక ఎల్ నినో కారణంగా మారిన వాతావరణ పరిస్థితులు.. ఈసారి వర్షపాతాన్ని గణనీయంగా తగ్గించేశాయి. వర్షాకాలం ముగింపు దశకు వస్తున్నా.. చెప్పుకోదగ్గ వర్షాలే లేకపోవడంతో వ్యవసాయాన్ని నీటి కొరత వేధిస్తున్నది. చాలా ప్రాంతాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న దుస్థితిని చూస్తూనే ఉన్నాం. దేశీయ వ్యవసాయ రంగం ఎక్కువగా వర్షాధారమేనన్నది విదితమే. ఫలితంగా మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ ఆహారోత్పత్తుల సరఫరా ఉండకపోవచ్చన్న అంచనాలే కనిపిస్తున్నాయి.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే మూడీస్ రేటింగ్స్ పైవిధంగా స్పందించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాను మూడీస్ 7 శాతానికి పెంచింది. ఇంతకుముందు ఇది 6 శాతంగా ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావాన్ని భారత్ ధీటుగా తట్టుకొంటున్నదని, అందుకే అంచనాలను పెంచుతున్నట్టు మూడీస్ పేర్కొన్నది.