న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: స్వదేశీ చిప్ తయారీ కంపెనీలు టాటా ఎలక్ట్రానిక్స్, ఎల్అండ్టీ సెమీకండక్టర్ (ఎల్టీఎస్సీటీ) జట్టు కట్టాయి. ఇక ఇరు సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లో చిప్‌లు తయారు కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల సహాయ మంత్రి జితిన్ ప్రసాద, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఎంవోయూపై ఆయా సంస్థలు సంతకాలు చేసి మార్చుకున్నాయి. కాగా, టాటా ఎలక్ట్రానిక్స్ దొలేరాలో ఓ చిప్ తయారీ కేంద్రాన్ని రూ.91,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నది. మరోవైపు ఎల్అండ్టీ సెమీకండక్టర్ చిప్ డిజైన్, దాని అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నది.
‘ఎల్టీఎస్సీటీతో మా భాగస్వామ్యం కీలక అడుగు. సెమీకండక్టర్ తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్‌లకు సంబంధించి మా సామర్థ్యాలతో ఎల్అండ్టీ సెమీకండక్టర్ డిజైనింగ్, ఇంజినీరింగ్ నైపుణ్యం తోడైతే పూర్తిస్థాయిలో సెమీకండక్టర్ ఉత్పాదక దేశంగా భారత్ పరుగులు పెట్టగలదు’ అని టాటా ఎలక్ట్రానిక్స్ సీఈవో, ఎండీ రణ్‌ధీర్ థాకూర్ ఈ సందర్భంగా విశ్వాసాన్ని కనబర్చారు. అలాగే ‘టాటా ఎలక్ట్రానిక్స్‌తో కలిసి దేశంలో తర్వాతి తరం సెమీకండక్టర్ ఉత్పత్తులను తయారుచేసే సామర్థ్యాలను నిర్మిస్తాం. గ్లోబల్ మార్కెట్లలోకి విస్తరిస్తాం’ అని ఎల్టీఎస్సీటీ సీఈవో సందీప్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.