Cattle fair | జహీరాబాద్, ఫిబ్రవరి 1 : సంవత్సరానికి ఒకసారి జరిగే పశువుల జాతర (సంత) కిక్కిరిసిపోయింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన ప్రత్యేక పశువుల జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు పశువులను ప్రత్యేక వాహనాల్లో తీసుకువచ్చారు. పశువులను కొనుగోలు చేసేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తరలివచ్చారు.
పశువుల సంతలో దియోనీ, ఒంగోలు, కిల్లరి తదితర జాతులకు చెందిన ఎడ్లు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలు సుమారు రూ. 50 వేల నుంచి రూ. 5.40 లక్షల వరకు ధర పలికాయి. ఈ జాతరలో రాయికోడ్ జంగి గ్రామానికి చెందిన సమీర్ రూ. 2.40 లక్షలకు ఎడ్ల జతను కొనుగోలు చేశాడు. అనంతరం దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఉత్తమ పశుపోషకులైన రైతులకు స్థానిక గ్రామానికి చెందిన దివంగత అడివప్ప, గిరిజమ్మ జ్ఞాపకార్థం బహుమతులను జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, పట్టణ సీఐ శివలింగం, హద్నూర్ దోమ సుజిత్లు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శిల్పాకారుడు డా. హోతి బస్వరాజ్, జాతర నిర్వాహకులు యూనుస్ఖాన్, మక్సూద్, నర్సింహులు, వాహెబ్ పాల్గొన్నారు.

