Harishrao | వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి నేటికి 700 రోజులు గడుస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రజలను మోసం చేసిన మీరు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు..? అని కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలలో హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గుమ్మడిదలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓటు అడిగే నైతిక అర్హత లేదు. మహిళలకు మహాలక్ష్మి కింద రూ. 2500 రాలేదు, రైతులకు రూ. 15 వేల రైతు భరోసా రాలేదు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రాలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. నిరుద్యోగులకు మొదటి ఏడాదిలో ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన మీరు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు..?అని ప్రశ్నించారు.ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటికీ రైతుబంధు డబ్బులు వేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలోనే రైతుబంధు పడేది.ఇప్పుడు నారు పోసుడు అయిపోయింది, దుక్కి దున్నుడు అయిపోయింది, కలుపు తీయడం అయిపోయింది.. ఇప్పుడు యూరియా చల్లుతున్నారు. ఇంకెప్పుడు రైతుబంధు ఇస్తావు రేవంత్ రెడ్డి.
కరోనా కష్టకాలంలో కూడా ఆపకుండా 11 సార్లు రైతుబంధు ఇచ్చి రూ. 82,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక నాయకుడు కేసీఆర్.మున్సిపాలిటీల్లో రైతులు ఉండరని, వాళ్లకు రైతుబంధు వేయకపోయినా నడుస్తుందని రేవంత్ రెడ్డి భ్రమలో ఉన్నాడు.సగం మున్సిపాలిటీల్లో ఉన్నది రైతులే. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రైతులందరూ ఏకమై రేవంత్ రెడ్డి వీపు పగలగొట్టడం ఖాయమన్నారు.
ఏ సబ్‌స్టేషన్‌కు వెళ్దామో రండి..
అవ్వాతాతలకు రూ. 4000 పెన్షన్ ఇవ్వకపోగా, ఉన్న పెన్షన్లలో 2 లక్షల మందికి కోత పెట్టారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.నేను కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేస్తున్నా.. ఏ సబ్‌స్టేషన్‌కు వెళ్దామో రండి. 24 గంటల కరెంటు వస్తుందా చూద్దాం.. కనీసం 12 గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.ముస్లిం సోదరులను కాంగ్రెస్ తీవ్రంగా మోసం చేసిందన్నారు . రెండున్నర ఏళ్లలో ఇమామ్, మౌజంలకు జీతాలు పెంచారా..? రూ. 4000 కోట్ల బడ్జెట్ పెట్టారా..? మైనార్టీ యువతకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చారా..? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో 30 శాతం కూడా అమలు చేయలేదు. దళిత బంధు మూలనబడ్డది. గొర్రెల పంపిణీ జాడ లేదు. ఇచ్చిన ఒక్క పథకం ఫ్రీ బస్సు.. అది కూడా తుస్సుమంది. మగోళ్లకు డబుల్ టికెట్ రేట్లు పెట్టారని హరీష్ రావు ఆరోపించారు.
రేవంత్ రెడ్డి రెండున్నర ఏళ్లలో ఏ ఊర్లోనైనా, ఏ మున్సిపాలిటీలోనైనా తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు. ఉన్న పథకాలను రద్దు చేయడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలన్నారు.
LIVE: Former Minister and MLA @BRSHarish election campaign in Gaddapotharam Municipality. https://t.co/iaNUQpwCbI
— BRS Party (@BRSparty) February 4, 2026
Suryapet : ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్‌పై వేటు వేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
BC JAC : మిర్యాలగూడలో బీసీ జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్
Arrest : కనగల్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్