రుద్రంపూర్, ఆగస్టు 06 : తెలంగాణ ఉపాధి, శిక్షణ శాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు, ఏటీసీలు, ఆర్ఐటీఐలు, మైనారిటీ ఐటీఐలు అలాగే ప్రైవేట్ ఐటీఐల్లో ఆగస్టు–2026 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. 10వ తరగతి లేదా 8వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఆయా ట్రేడ్ల అర్హతల ప్రకారం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, అయితే సర్టిఫికెట్ల ధృవీకరణ పూర్తి చేయని వారు తప్పనిసరిగా పూర్తి చేసి, తమ లాగిన్ ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో రూ.100 అప్లికేషన్/వెరిఫికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ఇప్పటికే దరఖాస్తు చేసిన వారికి ఈ ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. ఎంపిక పూర్తిగా మెరిట్, రిజర్వేషన్ నిబంధనలు, అభ్యర్థులు ఇచ్చిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా జరుగుతుందని వెల్లడించారు.
ఆన్లైన్ దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు : ఆగస్టు 6 నుంచి 15 వరకు
ఒరిజినల్ సర్టిఫికెట్ల ధృవీకరణ : ఆగస్టు 8 నుంచి 17 వరకు
సీట్ల కేటాయింపు : ఆగస్టు 20
ఎంపికైన విద్యార్థుల రిపోర్టింగ్ : ఆగస్టు 21 నుంచి 24 వరకు
అభ్యర్థులు పూర్తి వివరాలు, ట్రేడ్ల జాబితా, ప్రవేశ నిబంధనల కోసం తెలంగాణ ఐటీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఉపాధి, శిక్షణ శాఖ సూచించింది.