Municipalities | పటాన్ చెరు, జూన్ 9: మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు పెరిగాయని విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు కనీస అవసరాలైన పారిశుధ్యం, తాగు నీరు, మౌళిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు. మున్సిపల్‌కు పాలక మండలి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపం, మున్సిపల్ అధికారుల అవినీతి, అక్రమాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది.
మున్సిపల్ ఆదాయ వనరులు పక్కన పెట్టి ప్రభుత్వ నిబంధనలో ఉన్న లొసుగులు వారికి అనుకూలంగా మార్చుకొని అందిన కాడికి దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల్లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్ పూర్, బొల్లారం, ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా భారీగా డబ్బులు వసూలు చేసి అక్రమాలు పాల్పడుతున్నారు.
మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పనికి బహిరంగంగా వసూలు..?
మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అధికారులు ప్రతి పనికి బహిరంగంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి . మున్సిపల్ అధికారులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయిస్తున్నారని తెలిసింది. అధికారులకు నగదు డబ్బులు ముడితేనే పనులు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్యం, తాగునీరు సమస్యలు నెలకొన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
పారిశుద్ధ్య పనులు కొన్ని వార్డుల్లోనే చేస్తున్నారు. పారిశుధ్యం పనులు చేయాలని ప్రజలు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాలు కురవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని వెంటనే మురికి కాలువల్లో ఉన్న చెత్తను తొలగించాలని ప్రజలు కోరినా చర్యలు తీసుకోవడం లేదు. మున్సిపల్ కార్యాలయంలో వాణిజ్య భవనాల నిర్మాణం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.
మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదు. అనుమతుల్లో సెట్ బ్యాక్ లు చూపిస్తూ క్షేత్రస్థాయిలో ఎక్కడ నిర్మాణాలు చేయడం లేదు. మున్సిపల్ లో పనిచేసే టౌన్ ప్లానింగ్ అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వం నిబంధనలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకొని అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేస్తున్న వారి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
రెవెన్యూలో ప్రతి పనికి డబ్బులు వసూలు…?
మున్సిపల్ కార్యాలయంలో ఉన్న రెవెన్యూ విభాగంలో ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొత్తగా నిర్మాణమైన ఇండ్లకు పనులు వేసే దగ్గర నుంచి రీవాల్యుయేషన్ పేరు మార్పులు, తదితర వాటికి అధికారులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పనికి ఒక గడువు నిర్వహించిన అధికారులు ఇక్కడ అమలు చేయడం లేదు. మున్సిపల్‌కు రావాలసిన ఆదాయాన్ని సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. మ్యుటేషన్ కోసం రెవెన్యూలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అవినీతికి కేంద్రంగా మున్సిపల్ కార్యాలయాలు మారిపోయాయి.
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపం..!
మున్సిపల్ కు పాలకమండలి లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ సరిగా చేయకపోవడంతో మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, రికార్డులు పరిశీలన చేయకపోవడంతో అవినీతి ఆక్రమాలు పెరిగిపోతున్నాయి.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..