హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : అది ప్రభుత్వ ప్రాజెక్టు… దాని కోసం వేలాది మంది సన్న, చిన్నకారు రైతుల భూములు అవసరం. అప్పుడు ప్రభుత్వం తరఫున అధికారులు రైతులతో సంప్రదింపులు జరుపాలి. ప్రాజెక్టు ఉద్దేశం వివరించి సంతృప్తికరంగా పరిహారం ఇస్తామని నచ్చచెప్పి ఒప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నది? బలవంతపు భూసేకరణకు ఒడిగడుతుంది. భూములే తమ సర్వస్వం అనుకున్న రైతుల ఆవేదనను గాలికొదిలి ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తున్నది. కనీసం రైతులతో సంప్రదించకుండానే రెవెన్యూ రికార్డుల్లో రైతుల పట్టా భూములను సర్కార్ భూములుగా మార్చి నిషేధిత జాబితాలోకి చేర్చింది. ఇదీ రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్‌సిటీ కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్‌సిటీ ఏర్పాటులో భాగంగా రావిర్యాల అవుటర్ రింగ్‌రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) ఆకుతోటపల్లి వరకు సుమారు 41 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును 300 ఫీట్ల వెడల్పుతో నిర్మించాలని నిర్ణయించింది.
వాస్తవానికి నాటి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ ఫార్మాసిటీలో భాగంగా విశాలమైన రహదారులు నిర్మించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక చొరవ తీసుకొని ఆకుతోటపల్లి వరకు ఇంత భారీ వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మిస్తుండటంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అయితే రోడ్డు నిర్మాణం కోసం సుమారు వెయ్యి ఎకరాల వరకు భూముల్ని సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో కొంత ప్రభుత్వ భూమి ఉండగా, మిగితాది సన్న, చిన్నకారు రైతుల పట్టా భూములు. భూసేకరణలో భాగంగా ఇప్పటికే కొంగరఖుర్దు, కొంగరకలాన్, పంజాగూడ, మీర్ఖాన్పేట్, గుమ్మడవెల్లి, లేమూర్, తిమ్మాపూర్, విట్టాయపల్లి తదితర గ్రామాల్లో ఇప్పటికే ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు.
తమ విలువైన భూములను రోడ్డు నిర్మాణం కోసం తీసుకోవడాన్ని రైతులు మొదటినుంచే వ్యతిరేకిస్తున్నారు. సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించి, బలవంతంగా రైతుల్ని నిర్బంధించి సర్వే పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారులు రైతులకు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఆ నోటిఫికేషన్ సరైనది కాదని, బయట మార్కెట్లో ధర నిర్ణయించి, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మార్కెట్ విలువకు రెండింతల పరిహారం మాత్రమే ఇస్తామని చెబుతున్నది. కోట్లాది రూపాయల ధర పలికే భూముల్ని వదులుకునేందుకు రైతులు ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం పంతానికి పోకుండా వారితో సంప్రదింపులు జరిపి, సంతృప్తికరమైన పరిహారాన్ని నిర్ధారించాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకపోగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టేందుకు నిర్ణయించిన ప్రభుత్వం తొలి విడుతలో భాగంగా అవుటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మీర్ఖాన్పేట్ వరకు ఉన్న భూముల్లో నిర్మించాలని యోచిస్తున్నది. ఈ మేరకు మొత్తం 19 కిలోమీటర్ల రోడ్డు కోసం 450 ఎకరాలు సేకరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం రైతులకు చెప్పకుండా వారి పట్టా భూములన్నింటినీ నిషేధిత జాబితా(22ఏ)లోకి చేర్చింది. ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు జరుపకుండా ప్రభుత్వ ఖాతాలో వేసుకున్నది. దీంతో పాటు రెండో దశలో రోడ్డు నిర్మాణాన్ని చేపట్టే మీర్ఖాన్పేట్ నుంచి ఆకుతోటపల్లి వరకు వివిధ గ్రామాల పరిధిలోని మరో 550 ఎకరాల పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చినట్టు తెలిసింది. తమకు తెలియకుండానే భూములను నిషేధిత జాబితాలో చేర్చటంపై రైతులు భగ్గుమంటున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుతో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఎట్టి పరిస్థితిలో భూములివ్వమని ఇప్పటికే చెప్పినా బలవంతంగా నిషేధిత జాబితాలో చేర్చటం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం కానీ భూములిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు. కాగా పట్టా భూముల్లో భాగంగా అద్వైత రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసిన మరో 90మంది కూడా కోర్టును ఆశ్రయించారు.
ఫ్యూచర్‌సిటీ కోసం ఇప్పటికే నాగార్జునసాగర్, శ్రీశైలం హైవేలతో పాటు తిమ్మాపూర్ తదితర గ్రామాల నుంచి విశాలమైన రోడ్లు ఉన్నాయి. వాటని కాదని కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేయాలని ప్రభుత్వం చూస్తున్నది. ఈ రోడ్డు వల్ల మాకెలాంటి ఉపయోగం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్థం కోసం ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మిస్తున్నది. ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకొని కార్పొరేట్ సంస్థలకు అధిక ధరలకు విక్రయించి రైతుల పొట్టకొడుతున్నది. భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. అవసరమైతే సుప్రీంకోర్టు వెళ్తాం.