హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ) : మూసీ బఫర్ సామాన్యుడిని ఇంకా భయపెడుతూనే ఉన్నది. నదికి రెండు వైపులా 50 మీటర్ల బఫర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తేల్చిచెప్పడంతో పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన గెజిట్‌లో పది వేల నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని చెప్పినా.. అది కేవలం రివర్బెడ్, ఎఫ్ఆర్ఎల్ పరిధి వరకు లెక్కించినవేనని.. ఎఫ్ఆర్ఎల్ నుంచి ఇరువైపులా 50మీటర్ల మేర బఫర్‌జోన్‌ను విస్తరిస్తే నిర్మాణాల సంఖ్య 50వేలు దాటుతుందని ప్రజాసంఘాలు అంచనా వేస్తున్నాయి. ఇంత భారీస్థాయిలో నిర్మాణాలు ఉన్నందునే ప్రభుత్వం మూసీపై దోబూచులాడటంతో పాటు ఎంఆర్డీసీఎల్ అధికారులు బఫర్‌తో పాటు గూగుల్ చిత్రాలను బయటికి విడుదల చేయలేదని తెలుస్తున్నది.
మూసీ పునరుజ్జీవన పథకంలో నేలమట్టమయ్యే నిర్మాణాలు భారీగానే ఉంటాయనే అంచనాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. గతంలో ప్రభుత్వం ప్రజాసంఘాలకు ఇచ్చిన ప్రజంటేషన్‌తో పాటు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో నదికి ఇరువైపులా కిలోమీటర్ పరిధిని అభివృద్ధి కారిడార్‌గా మలుస్తామని చెప్పింది. ఇప్పుడు అధికారులు మాత్రం కిలోమీటర్ అనేది కేవలం ప్రచారం మాత్రమేనని అధికారిక డాక్యుమెంట్లను సైతం కొట్టిపడేస్తున్నారు. ఇదే సమయంలో మూసీకి రెండువైపులా 50 మీటర్ల బఫర్‌జోన్‌ను మాత్రం పరిగణనలోకి తీసుకొని ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు కుండబద్దలు కొట్టారు.
గతంలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) ఈ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో భాగంగా 10,017 నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తామని చెప్పారు. నివేదికల్లో చూపిన 10వేల నిర్మాణాలు రివర్బెడ్తో పాటు బఫర్‌జోన్ పరిధిలోనివి అని చెబుతున్నారు. మరి ఎఫ్ఆర్ఎల్ పరిధిలోని నిర్మాణాలను మాత్రం వెల్లడించడం లేదు. సర్వేలో భాగంగా అధికారులు గూగుల్ మ్యాప్‌ను సైతం రూపొందించారు. దానిని బయటికి విడుదల చేయనప్పటికీ ‘నమస్తే తెలంగాణ’ చేతిలో మాత్రం ఆ మ్యాప్ ఉన్నది. అందులో మూసీ నది పొడవునా అంటే జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు నది వెడల్పు(రివర్బెడ్)ను రెడ్ మార్కుతో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను నీలి రంగుతో గుర్తించారు. కానీ ఎక్కడా బఫర్ జోన్ గుర్తించలేదు.
బఫర్ లెక్కలు దాచి ప్రజలకు చిక్కులు!
మూసీని రివర్బెడ్, ఎఫ్ఆర్ఎల్, బఫర్‌జోన్‌గా చూస్తే… గూగుల్ మ్యాపులో ఎఫ్ఆర్ఎల్ వరకు అధికారులు చెబుతున్న 10,017 నిర్మాణాలు ఉండొచ్చని తెలుస్తున్నది. కానీ ఎఫ్ఆర్ఎల్ నుంచి ఇరువైపులా 50 మీటర్ల బఫర్‌జోన్‌ను పరిశీలిస్తే మాత్రం నిర్మాణాలు భారీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాపూఘాట్ నుంచి మూసారాం బ్రిడ్జి వరకు దాదాపు 15 కిలోమీటర్లు పొడవునా ఉన్న కీలకమైన ప్రాంతంలోనే వేలల్లో ఉన్నాయి. సామాజిక ఆర్థిక సర్వేలో కేవలం ఎఫ్ఆర్ఎల్ వరకు లెక్కలు మాత్రమే వెల్లడించి, బఫర్ జోన్ పరిధి నిర్మాణాల సంఖ్యను దాచి పెడుతున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
నదికి ఇరువైపులా ఉన్న బాపూనగర్, శ్రీలక్ష్మీనగర్కాలనీ, కరణ్‌సింగ్ రోడ్డు, రతన్ నగర్ రోడ్డు, కేశవ స్వామి మహారాజ్ మార్గ్, ఒమర్ మసీద్ రోడ్డు, జియాగూడ, కాకయ్య మార్గ్, జుమెరాత్ బజార్ రోడ్డు, పురానాపూల్, గొల్లకిడికి రోడ్డు, ఝాన్సీ బజార్, మొఘల్‌నగర్, చట్టా బజార్, రెహ్మనీయ మజీద్ రోడ్, గౌలిదొడ్డి, జమాలా బస్తీ, చాదర్ ఘాట్, ఆర్టీసీ క్వార్టర్స్, ఆలంఘీర్ లేన్, అటు మలక్‌పేట్ రేస్ కోర్సుకు ఎదుట నుంచి వెళ్లే మార్గంలో ఉన్న జిందా తిలిస్మాత్ రోడ్డు వరకు నిర్మాణాలను పరిగణనలోకి తీసుకుంటే నిర్మాణాల సంఖ్య 50వేలకు మించుతాయని అంచనా. మలక్‌పేట రేస్ కోర్స్ సమీపంలోని రెండు కిలోమీటర్ల పరిధిలో దాదాపు 72వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలోనే కేవలం 5వేలకు పైగా నిర్మాణాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
పొంతన లేని లెక్కలు
సర్కార్ చెబుతున్న 50మీటర్ల బఫర్‌జోన్ లెక్కలు, కిలోమీటర్ వెడల్పుతో అభివృద్ధి ప్రణాళికలు, రివర్, ఎఫ్టీఎల్ జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాలకు మధ్య పొంతన కుదరడం లేదని అనుమానాలు కలుగుతున్నాయి. మూసీ సగటు వెడల్పు 180-220 మీటర్ల మేర హిమయత్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు విస్తరించి ఉన్నది. ఇందులో రివర్బెడ్(రెడ్ లైన్), ఎఫ్టీఎల్(బ్లూ లైన్) ఉంది. దీనికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్‌జోన్ తీసుకుంటే ఆ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలన్నీ తొలగించాల్సిందే. కేంద్ర జల సంఘం నిబంధనల ప్రకారం 50 మీటర్ల బఫర్ జోన్ నిర్మాణాలు ఉండకూడదని చెబుతున్న సర్కార్.. ఎందుకు ఆ ప్రాంతంలోని నిర్మాణాలను లెక్కించలేదని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ 10వేల నిర్మాణాలే ఉంటే.. ఎందుకు రివర్బెడ్ పేరిట గతంలో నోటీసులు ఇచ్చిన వివరాలను బయటపెట్టలేదని అడుగుతున్నారు. సర్కార్ చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేకపోవడంతో బఫర్‌జోన్ పేరిట మూసీ వెంబడి 50వేలకు పైగా నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లను ఎగదోయనున్నదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.