పాపన్నపేట, జూన్ 9: రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన మహిమగల మహాతల్లి ఏడుపాయల వన దుర్గ భవాని మాతను ప్రముఖ సినీ నటుడు నరేష్ (Naresh) దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఏడుపాయల ఆలయ సిబ్బంది, పురోహితుడు పార్థివ శర్మ స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పేరు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ప్రసిద్ధిగాంచిన దుర్గామాతను దర్శించుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించిందన్నారు. ఏడుపాయల ఆలయం ముందు ప్రవహిస్తున్న మాజీరా నదితో పాటు ఇక్కడి లొకేషన్ తమను ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను వేద పండితులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖ సినీ నటులు అమ్మవారి పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. గతంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ సైతం అమ్మవారిని దర్శించుకున్నారు.