చండీగఢ్: అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో యువ మహిళా పైలట్ రెస్క్యూ మిషన్‌లో కీలక పాత్ర పోషించింది. యూఏఈలో చిక్కుకున్న 169 మంది భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చింది. ఈ రెస్క్యూ మిషన్‌కు ముందు తాను తిరిగి వస్తానో లేదోనని తన తల్లితో ఆమె అన్నది. (UAE Rescue Mission) హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల దీపిక అధానా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పైలట్. మార్చి 6న ఉదయం 10:15 గంటల సమయంలో రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా యూఏఈలోని రాస్ అల్ ఖైమాకు వెళ్లాలని అకస్మాత్తుగా ఆమెకు ఆదేశాలు వచ్చాయి. వాస్తవానికి ఆమె సహోద్యోగి ఆ విధులు చేపట్టాల్సి ఉన్నది. ఆ పైలట్ అందుబాటులో లేకపోవడంతో టేకాఫ్‌కు కేవలం రెండు గంటల ముందు ఆ బాధ్యత చేపట్టాలని దీపికకు ఆదేశాలు అందాయి. విమాన సిబ్బందికి తగిన సూచనలు చేయడంతో పాటు భద్రతకు భరోసా ఇచ్చారు.
కాగా, రెస్క్యూ మిషన్‌కు ముందు పైలట్ దీపిక తన తల్లితో మాట్లాడింది. ‘అమ్మా.. నేను తిరిగి వస్తానో లేదో తెలియదు. బై బై’ అని చెప్పింది. కెప్టెన్ జస్వీందర్ కౌర్, పైలట్ దీపికాతో సహా మరో నలుగురితో కూడిన పూర్తి మహిళా సిబ్బందితో ఆ విమానం టేకాఫ్ అయ్యింది. మార్చి 6న మధ్యాహ్నం 2:00 గంటలకు యూఏఈలోని రాస్ అల్ ఖైమా ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయింది. విమాన సిబ్బందికి అక్కడ అసాధారణ వాతావరణం కనిపించింది.
మరోవైపు గంట తర్వాత 169 మంది భారతీయ ప్రయాణికులు విమానం ఎక్కారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. అయితే యుద్ధ పరిస్థితి నేపథ్యంలో టేకాఫ్ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు క్లుప్తంగా తెగిపోయాయి. దీంతో ఆ విమాన సిబ్బంది కొంత ఆందోళన చెందారు.
అయితే ఆ తర్వాత నెట్వర్క్ సాధారణ పరిస్థితికి వచ్చింది. సాయంత్రానికి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. యూఏఈలో చిక్కుకున్న తమను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చినందుకు ప్రయాణికులు ఆ విమాన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. యువ పైలట్ దీపిక కూడా క్షేమంగా తిరిగి రావడంతో ఆమె కుటుంబం ఊరట చెందింది.
Also Read:
IndiGo flight U-turn | ఇథియోపియా సరిహద్దు దగ్గర ఇండిగో విమానం యూ టర్న్.. ఢిల్లీలో ల్యాండ్
Man Sets Partner on Fire | స్కూటీ ఇచ్చేందుకు నిరాకరణ.. మహిళ, ఆమె పేరెంట్స్‌కు నిప్పంటించిన వ్యక్తి
Two MPs don’t take salary | ఇద్దరు లోక్‌సభ ఎంపీలు జీతం తీసుకోవడం లేదు.. వారు ఎవరంటే?