Infosys : ఐటీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో 20,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ గురువారం సంస్థకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న సిబ్బందికి వేతనాల పెంపు ప్రక్రియ వచ్చే అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది.
వివిధ విభాగాల వారీగా వేతనాల పెంపు ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, ఎంత శాతం వేతనాల పెంపు ఉంటుంది అనే వివరాల్ని సలిల్ పరేఖ్ వెల్లడించలేదు. కానీ, సీనియర్ ఉద్యోగులకు మాత్రం అధిక స్థాయిలో వేతనాల పెంపు ఉంటుందని చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఈ వేతనాల పెంపు ఉంటుంది. ఇక, ఈ ఆర్థిక సంవత్సరంలోనే సంస్థలో భారీగా ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు చెప్పారు. 20,000 మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకుంటామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇప్పటికే 4,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నామని చెప్పారు. ఇన్ఫోసిస్‌లో గత జూన్ 30 నాటికి 3,28,062 మంది సిబ్బంది పని చేస్తున్నారు. గత మార్చిలో ఈ సంఖ్య 3,28,594 మంది సిబ్బంది ఉన్నారు.
అంటే, స్వల్పంగా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఇన్ఫోసిస్ వ్యాపారంలో ఏఐ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం సంస్థకు ఏఐ ద్వారా అందే ఆదాయం 8.2 శాతంగా ఉంది. అంతకుముందు ఇది 5.5 శాతంగా ఉండేది. సంస్థ బాధ్యతల నిర్వహణకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు అశిష్ కుమార్ దాస్‌ను బోర్డు మెంబర్లు నూతన సీఈవోగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఉన్న సలిల్ పరేఖ్ స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. సలీల్ పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. ఆయన తర్వాత అశిష్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు.