Mojtaba Khamenei : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని ఎక్కడ ఉన్నారు.. ఎలా ఉన్నారు అనే విషయంలో సందేహాలున్నాయి. అయితే, ఈ విషయంలో ఇరాన్ మత గురువుల్లో ఒకరైన మోసెన్ హైదరి కీలక విషయాలు వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన రెండు దాడుల నుంచి ఖమేని బయటపడ్డట్లు వెల్లడించారు. గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపాయి. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేని మరణించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ సమయంలో ఖమేని తనయుడు మొజ్తాబా ఖమేని (56) తప్పించుకున్నట్లు ప్రచారం జరిగింది. హైదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేని గాయపడగా.. ఆయనకు టెహ్రాన్‌లో ఉన్న ఒక ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే, ఈ ఆస్పత్రిపై కూడా అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో ఆస్పత్రి భవనం ధ్వంసం కాగా.. ఆ శిథిలాల నుంచి ఖమేనిని బయటకు తీశారు. అలా, రెండు సార్లు అమెరికా జరిపిన దాడి నుంచి ఖమేని బయటపడ్డట్లు హైదరి వెల్లడించారు. ఖమేనిని ఆస్పత్రికి తరలించిన తర్వాత మరో మూడు ఆస్పత్రులపై కూడా దాడి జరిగిందని తెలిపారు.
ఘటన జరిగిన తర్వాత నుంచి ఖమేని ఇప్పటివరకు బయట కనిపించలేదు. ఇప్పటికీ ఆయన బతికి ఉన్నారా.. లేదా.. అనే విషయంలో కూడా స్పష్టత లేదు. తండ్రి అయతొల్లా ఖమేని, కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు కూడా ఆయన హాజరుకాలేదు. అయితే, అయతొల్లా మరణం తర్వాత ఆయనను ఇరాన్ అగ్రనేతలు సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. అయనను మ్యాన్ ఆఫ్ షాడోస్గా హైదరి అభివర్ణించారు. ప్రస్తుతం మొజ్తబా ఖమేని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవల ప్రకటించారు.