CJP Protesters : సీజేపీ ఆందోళనలో పాల్గొన్న వారిలో హింసకు పాల్పడ్డవారికి ఢిల్లీ పోలీసులు షాకివ్వనున్నారు. నిరసనలో హింసకు పాల్పడ్డవారి పాస్‌పోర్టు రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఒకపక్క విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేస్తే.. మరోపక్క పోలీసులు, భద్రతా బలగాలపై కొందరు రాళ్ల దాడి చేశారు. వాహనాలు, ఆస్తులు ధ్వంసం చేశారు.
అలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇందుకోసం సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు, డిజిటల్ ఎవిడెన్స్‌ను పరిశీలిస్తున్నారు. అనంతరం నిందితుల్ని గుర్తించి, వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నారు. ముఖ్యంగా ఆస్తుల ధ్వంసం, దాడులు, భద్రతా సిబ్బందిని గాయపర్చడం వంటి చర్యలకు పాల్పడ్డ వారిపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నారు. వీరి పాస్‌పోర్టులు రద్దు చేస్తే విదేశాలకు వెళ్లే అవకాశాల్ని కోల్పోతారు. మరోవైపు నిందితులపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ)ను ప్రయోగించనున్నారు. ఈ మేరకు వచ్చే అక్టోబర్ 18 వరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు.
దీని ప్రకారం హింసకు పాల్పడే వ్యక్తులను 12 నెలల వరకు నిర్బంధంలో ఉంచవచ్చు. వారి చర్యలు భద్రతకు ముప్పుగా మారినా లేదా ప్రజా ఆస్తులకు భంగం కలిగించినా వారిపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ విషయంలో సీజేపీ చేపట్టిన ఆందోళన ఇంకా కొనసాగుతోంది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. దీనిపై కేంద్రం సీజేపీని చర్చలకు ఆహ్వానించింది. అయితే, సీజేపీ మాత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.