Gujarat : గుజరాత్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ గుజరాత్‌లోని అనేక ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయి. దీంతో దాదాపు 1200 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పరిస్థితిని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సమీక్షిస్తున్నారు. ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా ఆయన కేంద్రాన్ని కోరారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, కోస్ట్ గార్డ్స్, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
సూరత్ ప్రాంతం నుంచి 1,500 మందిని, నవ్సారి జిల్లా నుంచి 200 మందిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కావేరి నది ఉప్పొంగడం వల్ల నవ్సారి జిల్లాలోని 11 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వర్సాద్ జిల్లాపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. బుధవారం, గురువారాల్లో ఇక్కడ 1,100 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొన్నిచోట్ల 600 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అయితే, వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేస్తోంది. వల్సాద్, నవ్సారి, సూరత్, తాపి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దీంతో వర్ష ప్రభావంతో ఇంకా అనేక ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం భూపేంద్ర పటేల్ తమకు సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాను కోరారు. ప్రజలను రక్షించడం, తరలించడం వంటి సహాయక చర్యల్లో సాయం చేయాలని అభ్యర్థించారు.