సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ లాల్బజార్సెక్షన్లో సుమారు ఏడుగంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. ప్రతిరోజూ అంతరాయమేర్పడుతున్నదని స్థానిక అధికారులకు, సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ఐదు నుంచి పదినిమిషాలకే మీ సమస్య పరిష్కరించబడిందని మెసేజ్‌లు రావడంతో వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అసలు తమ సమస్య పరిష్కరించకుండానే మెసేజ్‌లు ఎలా పంపుతున్నారంటూ వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సరూర్‌నగర్ పరిధిలోని బీఎన్‌రెడ్డి టీచర్స్ కాలనీలో అర్ధరాత్రి కరెంట్ పోయింది. మూడు నుంచి నాలుగుగంటల పాటు అప్రకటిత కరెంట్ కోతలు ఉన్నాయని వినియోగదారులు .
డిస్కంకు ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. వర్షం పడి ఆగిపోయిన తరవాత ఒకవైపు ఉక్కపోత, దోమల బాధతో అర్ధరాత్రి కరెంట్ లేక నిద్ర కరువైందని, ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ పోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని వారు చెప్పారు. ముఖ్యంగా తమ దగ్గర పనిచేసే లైన్మెన్ అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, సిబ్బంది ఫోన్ ఎప్పుడూ బిజీగా వస్తున్నదని ఆరోపించారు. అధికారులు మాత్రం కేవలం గంట పాటు కరెంట్ పోయిందని నందిహిల్స్ డిస్క్ ఇన్సులేటర్ దెబ్బతినడం కారణంగా సరఫరా నిలిచిపోయిందంటూ చెప్పా రు. కానీ క్షేత్రస్థాయిలో రాత్రి పదకొండున్నర నుంచి రెండు గంటల వరకు కరెంట్ పోయిందని వినియోగదారులు చెప్పారు.
హైదరాబాద్ సౌత్ సర్కిల్లోని మీర్ఆలమ్ట్యాంక్ సెక్షన్ పరిధిలో ఉన్న హసన్‌నగర్‌లో అర్ధరాత్రి కరెంట్ కోతలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు అప్రకటిత కరెంట్ కోతలతో పాటు ఉక్కపోతకు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పారు. బోడుప్పల్లో సిబ్బంది చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, గణేశ్ నిమజ్జనం సందర్భంగా తమ ప్రాంతంలో కరెంట్ తీసేయడంతో ఇబ్బంది కలుగుతున్నదని చెబితే అసలు పట్టించుకోకుండా బూతులు మాట్లాడారని క్షేత్రస్థాయి సిబ్బంది ఫోన్ నెంబర్‌తో సహా డిస్కంకు వినియోగదారులు ఫిర్యాదు చేశారు.
ఇలా నగరంలో అన్ని సర్కిళ్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అర్ధరాత్రి కరెంట్ కోతల నేపథ్యంలో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షం పడినట్లే పడి ఆగిపోవడంతో ఉక్కపోత విపరీతంగా ఉంటుంది. దీంతో పాటు నగరంలో విపరీతమైన దోమల బెడద ఉండడానికి తోడు కరెంట్ పోవడంతో చిమ్మచీకటిలో కష్టాలు పడుతున్నామని పలు కాలనీల ప్రజలు డిస్కంకు ఫిర్యాదు చేస్తున్నారు. కరెంట్ కోతలు గంట, రెండు గంటల పాటు కాకుండా ఏకంగా నాలుగైదు గంటల పాటు ఉండడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉంటున్నదని నగరవాసులు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ కోతలకు ఒకవైపు విద్యుత్ డిమాండ్ పెరగడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి ఉంటే మరోవైపు చిన్న చినుకు పడితేనే ఇన్సులేటర్లు పాడవడం, ఫీడర్లు ట్రిప్పవడంతో సరఫరా ఆగిపోతున్నది.
గ్రేటర్లో పది సర్కిళ్లలో 65 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు సగటున 85 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదవుతోంది. అయితే సాధారణంగా వర్షాకాలంలో వినియోగం తక్కువగా ఉండాల్సి ఉండగా ఈసారి ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియో గం విపరీతంగా పెరిగింది. సామర్థ్యానికి మించి డిమాండ్ నమోదవుతుండడంతో సబ్స్టేషన్లలోని ఫీడర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతూ తరచూ ట్రిప్పవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో గత సంవత్సరం కంటే వినియోగం సుమారు వెయ్యి మెగావాట్లు పెరిగింది.
దీంతో చాలాచోట్ల అప్రకటిత కరెంట్ కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాకాలంలో ఆల్టైమ్రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైంది. వేసవికాలంతో పోటీపడుతూ విద్యుత్ వినియోగం జరుగుతుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక చేతులెత్తేస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను అందిస్తున్నామంటూ అధికారులు చెబుతున్నప్పటికీ అంతర్గతంగా రకరకాల కారణాలు చూపుతూ విద్యుత్ కోతల ద్వారా లోటును పూడ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఓ సీనియర్ ఇంజినీర్ చెప్పారు. ఈ విషయంలో తామేం చేయలేకపోతున్నామని, దీనికి తోడు గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఇస్తున్న ఉచిత విద్యుత్ ప్రభావంతో మరింత ఒత్తిడి పెరుగుతున్నదని, దీంతో సాధారణ ప్రజలకు ఇస్తున్న సరఫరాలో అంతరాయాలు అధికారికంగా ప్రకటించకపోయినా అనధికారికంగా పెద్ద ఎత్తున కరెంట్ కోతలు ఉన్నాయంటూ వినియోగదారులు, క్షేత్రస్థాయిలో డిస్కం సిబ్బంది చెప్పారు.
అప్రకటిత కరెంట్ కోతలు జనాన్ని బెంబేలెత్తిస్తుంటే ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు విద్యుత్ సరఫరాపై ప్రభావం చూపిస్తున్నాయి. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కొద్ది వారాలుగా నగరవ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. పైకి మాత్రం కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నామని చెబుతున్నప్పటికీ టీజీఎస్పీడీసీఎల్ అధికారిక సోషల్‌మీడియా, 1912 టోల్‌ఫ్రీ నెంబర్ తదితర వాటికి వస్తున్న ఫిర్యాదులు కరెంట్ కోతలకు సంబంధించి వాస్తవాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఒక్కనెలలోనే నగర వ్యాప్తంగా సుమారు 15 నుంచి 20వేల ఫిర్యాదులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే గణేశ్ నిమజ్జన ఊరేగింపుల కోసం చెట్ల కొమ్మలను నరకడం వల్లే కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తితే త్వరగా పునరుద్దరించేందుకు ఏఐ ఆధారిత ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ సేవలు, 1912 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ పనిచేస్తున్నదని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇవేవీ సరిగ్గా పనిచేయడం లేదు. అధికారిక సోషల్‌మీడియాతో పాటు టోల్‌ఫ్రీ నెంబర్లకు, వాట్సప్ చాట్బాక్సుల్లో ఫిర్యాదులు ఒకటికి రెండుసార్లు చేసినప్పటికీ వారి నుంచి సమస్య పరిష్కారమైనట్లుగా పది నుంచి పదిహేను నిముషాల్లో మెసేజ్‌లు రావడం, లేకుంటే అసలు పట్టించుకోకపోవడం జరుగుతుందే తప్ప గంటల తరబడి పోతున్న కరెంట్‌ను పునరుద్దరించడంలో సిబ్బంది విఫలమవుతున్నారంటూ వినియోగదారులు మండిపడుతున్నారు.