యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్
(భగవద్గీత 9 – 27)
ఓ కౌంతేయా! నీవు ఏ కర్మ చేసినా, ఏ ఆహారం తీసుకున్నా, ఏ హోమాదులు చేసినా, ఏ దానాదులు సమర్పించినా, ఏ తపస్సును ఆచరించినా.. వాటినన్నిటినీ ‘నాకు’ సమర్పించు అని శ్రీకృష్ణుడు చెపుతున్నాడు. ఇక్కడ నాకు అంటే భగవంతుడికే అని భావం.
యత్ అంటే ఏదైనా… పూజా కార్యక్రమాలు, యజ్ఞయాగాదులు, దానధర్మాలు వంటి ధార్మిక కార్యాలకే పరిమితం కాకుండా, మనిషి చేసే ప్రతి కార్యాన్నీ సూచిస్తుంది. వృత్తి, కుటుంబ బాధ్యత, విద్య, సేవ, ఆహారం, మాట, ఆలోచన… ఇలాంటివేవైనా ఈశ్వరార్పణ బుద్ధితో, అహంకారం, ఫలాసక్తి లేకుండా నిర్వహించినప్పుడు అవి కర్మబంధానికి కారణం కావు. అలాంటి కర్మాచరణ చిత్తశుద్ధికి దోహదపడి, ఆత్మజ్ఞానం, మోక్షసాధనకు మార్గం సుగమం చేస్తుంది.
ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. చేసిన పని ధర్మబద్ధంగా చేయాలి, స్వార్థం, అహంకారం, ఫలాసక్తి లేకుండా చేయాలి, ఫలితాన్ని దైవప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తేనే కర్మబంధ విముక్తికి దారి లభిస్తుందే కానీ, తప్పుడు మార్గాలలో అధర్మ వర్తనలో కర్మబంధ విముక్తి కానేరదు అని గుర్తించాలి.
ఆధ్యాత్మిక జీవితం అనుకుంటే కర్మలను వదలడం కాదు, కర్మల పట్ల అంతర్గత దృక్పథాన్ని మార్చుకొని, కర్తృత్వ భావనను కర్మఫలంపై మమకారాన్నీ వదలడం ముఖ్యమని కృష్ణపరమాత్మ చెబుతున్నాడు. ‘నేనే అన్నిటికీ కర్తను అనే అహంకారం, ఈ కర్మ ఫలితం నాకే రావాలి అనే ఆసక్తి ఈ రెండే కర్తృత్వ భావనను పెంచి పోషిస్తాయి. వాటిని తొలగించుకోవడమే అంతర్గత దృక్పథాన్ని మార్చుకోవడం.
ఎందుకు కర్మ ఫలితాన్ని పరమాత్మకు సమర్పించాలి? అసలు కర్మనే చేయకపోతే… అనేవి ప్రశ్నలు. నడవడం, కూర్చోవడం, భుజించడం, చివరికి శ్వాసించడం కూడా కర్మయే కాబట్టి కర్మ చేయకుండా క్షణమైనా ఏ జీవికీ గడవదు. కర్మ చేస్తే దానికి అనుబంధమైన ఫలితమూ వస్తుంది. ఫలితం అనుభవించక తప్పదు.. కాబట్టి ఆ ఫలితాన్ని పరమాత్మకు అర్పించడం ద్వారా చిత్తం
మలినరహితమై మోక్షానికి అర్హతను సాధిస్తుంది.
కర్మలను భగవంతుడికి సమర్పించడం అంటే ఏమిటి? సాధారణంగా మానవులు ఏ పని చేసినా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అనుకున్న ఫలితం రాకపోతే దుఃఖం, వస్తే సంతోషం కలుగుతుంది. కాబట్టి చేసే పని యందు మమతాసక్తులు లేకుండా కర్తవ్యాన్ని నిరీహుడై చేస్తూ పోవడమే జీవుడు చేయవలసిన కర్తవ్యం. కర్మను ఆరంభించే ముందు ‘కర్తవ్యాన్ని‘ మాత్రమే నిర్వహిస్తున్నాననే ఈశ్వరార్పణ బుద్ధి.. కర్మ పూర్తయ్యాక ఫలితం ‘నాకు అనుకూలమైనా, ప్రతికూలమైనా, ఇది దైవప్రసాదమే’ అనే ప్రసాద బుద్ధి లేదా సమత్వ భావన కలిగేందుకే భగవంతుడి యందు ఫలితాన్ని సమర్పణ చేయడం.
తోలుబొమ్మలను ఆడించే సూత్రధారి ఎలా ఆడిస్తే ఆ బొమ్మలు అలా నటించిన విధంగానే భగవంతుడనే సూత్రధారి ఆడించిన విధంగా నేను ఆడుతున్నాననే భావన మదిలో నిలిచిపోతే ఫలితంపై ఆసక్తి సన్నగిల్లుతుంది. అయితే శక్తిసామర్థ్యాలు, అవకాశాలు దైవప్రసాదంగా భావిస్తూ వాటిని ఎలా వినియోగించాలో నిర్ణయించే బాధ్యత నాది అనుకున్నప్పుడే బాధ్యతతో పనిచేస్తాం. ఈ భావనలో వినయం కూడా ఉంటుంది.
ఆసక్తి లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా, పనిని నిబద్ధతతో, పూర్తి శక్తిసామర్థ్యాలను వినియోగించి నిర్వహించడమే సర్వసమర్పణా భావన. అదే కర్మలను భగవంతుడికి సమర్పించడంగా భావించాలి. ఇది ఆరంభంలో కృతకంగా కనిపించినా అలవాటుగా మారి అసంకల్పితంగానే ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వహించే మానసిక స్థితి అలవడుతుంది.
ఫలితాన్ని అర్పించడం అంటే బాధ్యతను వదిలేయడం, ప్రయత్నం చేయకపోవడం, ప్రణాళిక లేకుండా పని చేయడం, తప్పులను దైవం మీదికి నెట్టడం, నైతిక బాధ్యత నుంచి తప్పించుకోవడం లాంటివి కాదు… చేసే పనిని సరైన లక్ష్యంతో చేయడం, ధర్మబద్ధమైన మార్గంలో శ్రమించడం, పూర్తి శ్రద్ధతో నిర్వహించడం, సాధ్యమైనంతగా శక్తి సామర్థ్యాలను వినియోగించడం, ఫలితం వచ్చినప్పుడు అహంకారం లేదా నిరాశకు లోనుకాకుండా నిగ్రహంగా ఉండటం. దీనినే ఫలితాన్ని సమర్పించడంగా పరిగణించాలి. అందువల్ల ఈ భావన నిష్క్రియతకు కాదు, నిష్కామ కర్తవ్య నిర్వహణకు దారితీయాలి.
కర్మఫల సమర్పణ వల్ల ఆందోళన, అహంకారం, నిరాశ తగ్గుతాయి. సమత్వ భావన పెరుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. కాబట్టి కర్మయోగం అనేది కర్మలను విడిచిపెట్టే మార్గం కాదు. కర్మలను పవిత్రమైన దృక్పథంతో నిర్వహించే మార్గం. కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా, శ్రద్ధతో, తన శక్తిసామర్థ్యాలన్నిటినీ వినియోగించి చేయాలి. అయితే దాని ఫలితంపై మమకారం పెంచుకోకుండా, వచ్చిన ఫలితాన్ని దైవప్రసాదంగా స్వీకరించాలి. కర్మకు ముందు ఈశ్వరార్పణ బుద్ధి, కర్మ అనంతరం ప్రసాదబుద్ధి కలిగినప్పుడు మనసులో సమత్వం, వినయం, ప్రశాంతత పెరుగుతాయి. ఈ చిత్తశుద్ధి క్రమంగా కర్మబంధం నుంచి విముక్తికి, ఆత్మజ్ఞానానికి, మోక్షసాధనకు మార్గం సుగమం చేస్తుంది.
– పాలకుర్తి రామమూర్తి