మాస్కో, సెప్టెంబర్ 20: రష్యాలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్ భారీ దాడికి దిగింది.1600కు పైగా డ్రోన్ల దండుతో రష్యాను చుట్టుముట్టి భీకరంగా విరుచుకుపడింది. మునుపెన్నడూ లేని విధంగా మాస్కో, పరిసర ప్రాంతాలు లక్ష్యంగా ఆదివారం దాడులు చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశ రాజధాని మాస్కోపై ఈ స్థాయిలో దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ దాడిలో ఒక మహిళ, వృద్ధుడు మరణించారని, 20 మందికి పైగా గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు.1,600కు పైగా డ్రోన్లతో దాడి జరిగిందని, రాజధానిలోని మాస్కో ఆయిల్ రిఫైనరీ దెబ్బతిందని, అక్కడ ఎవరూ మరణించ లేదని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు.
రష్యా వాయురక్షణ దళాలు 450కు పైగా డ్రోన్లను నేలకూల్చాయని చెప్పారు. 21 అంతస్తుల భవనంలో ఒక డ్రోన్ చిక్కుకుపోవడంతో మంటలంటుకుని, భవనం ధ్వంసం అయ్యిందని, అధికారులు ఆ భవనంలోని 400 మంది పౌరులను ఖాళీ చేయించారని చెప్పారు. దాడి కారణంగా మాస్కోలోని విమానాశ్రయాలు మూతపడ్డాయి. పలు విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. మాస్కో రిఫైనరీపై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిర్ధారించారు. యుద్ధానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇంధన మౌలిక సదుపాయాల ధ్వంసమే లక్ష్యంగా తామీ దాడులు చేసినట్టు చెప్పారు. శనివారం రాత్రి రష్యా జరిపిన డ్రోన్ దాడిలో కీవ్ సమీపంలో తల్లి, ఇద్దరు పిల్లలు మరణించారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
ఎన్నికలను అడ్డుకునేందుకే…
రష్యాలో జరుగుతున్న ఎన్నికలను అడ్డుకునేందుకే ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడిందని మాస్కో మేయర్ సెర్గీ ఆరోపించారు. ఉక్రెయిన్పై 2022లో దురాక్రమణ ప్రారంభించిన తర్వాత రష్యాలో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఎన్నికలు ప్రారంభం కాగా, ఆదివారం పోలింగ్ ఆఖరి రోజున ఉక్రెయిన్ దాడికి దిగింది. ఎన్నికల అధికారి అస్తనీనా ఈ దాడిలో మరణించినట్టు పుతిన్ ఆరోపించారు. తమ దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్నదని రష్యా అధికారులు ఆరోపించారు.
సైనికులకు ప్రజల మద్దతును తెలిపే పరీక్ష
ఉక్రెయిన్లో పోరాడుతున్న రష్యా సైనికులకు ప్రజల మద్దతును తెలిపేందుకు ఈ ఎన్నికలు ఒక పరీక్ష అని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. రష్యా సైనికులకు ప్రజల మద్దతును ఈ ఎన్నిక నిరూపిస్తుందని పుతిన్ అన్నారు. పుతిన్ చేస్తున్న యుద్ధానికి, ఆయన విధానాలకు ప్రజల మద్దతు ఉందని చిత్రీకరించడానికి కూడా రష్యా ఈ ఎన్నికలను ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు ఆదివారం రాత్రి 11.30 గంటల నుంచి ప్రారంభమై.. సోమవారం నాటికి పూర్తిగా ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు.