టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా మరోసారి సైనిక చర్యలకు సిద్ధమవుతోందని తమకు సమాచారం అందిందని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ ఆదివారం వెల్లడించింది. కొన్ని ప్రాంతీయ దేశాల మద్దతుతో అమెరికా ఈ చర్యలకు సన్నాహాలు చేస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. అమెరికా దాడులకు దిగితే ప్రాంతీయంగా ఉన్న అమెరికా స్థావరాలపై నిరంతరం దాడులు కొనసాగుతాయని ఇరాన్ సైనిక కమాండ్ హెచ్చరించింది.
ఇరాన్‌లోని ఖాతమ్ అల్ అన్బియా ప్రధాన కార్యాలయం తన ప్రకటనలో అమెరికాతో కలసి వ్యవహరించే పశ్చిమాసియా దేశాలకూ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా స్థావరాల నుంచి ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు పునఃప్రారంభమైతే, వాటికి సహకరించే ప్రాంతీయ దేశాలను కూడా ఘర్షణలో భాగస్వాములుగా పరిగణిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలోని పలు దేశాల్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు ఆదివారం ఉదయం తమ పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపాయి.
అమెరికాకు 7 షరతులు
యుద్ధం ముగించేందుకు అమెరికాతో చర్చలు జరపడానికి సిద్ధమని ఇరాన్ వెల్లడించింది. అయితే చర్చల్లో పాల్గొనాలంటే ఏడు షరతులకు అమెరికా ఒప్పుకోవాలని తెలిపింది. ఈ మేరకు తమ షరతులను అమెరికాకు ఖతార్ చేరవేసిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మెహ్‌సెన్ రెజాయీ చెప్పారు. ఈ చర్చలపై అమెరికా అధ్యక్షుడి స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను తిరస్కరిస్తే మరింత దూకుడుగా నిర్ణయాత్మక యుద్ధానికి దిగుతామని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా ముందు కీలక షరతులు..
చర్చల్లో పాల్గొనాలంటే అన్ని విధాలుగా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడం, విదేశాల్లో నిలిపివేసిన నిధులను విడుదల చేయడం ఇందులో కీలకంగా ఉన్నాయి. అలాగే అమెరికా సైనిక చర్యలను నిలిపివేయడం, ప్రాంతీయ స్థాయిలో కాల్పుల విరమణకు హామీలు, ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు ఎత్తేసి ఆర్థిక ఒత్తిడికి పరిష్కారం చూపడం, భవిష్యత్ చర్చలకు సంబంధించిన భద్రతా, రాజకీయ హామీలు ఇందులో ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే అమెరికా తమ నౌకా దిగ్బంధనాన్ని ఎత్తేయాలనే ప్రధాన డిమాండ్ ఇందులో ఉన్నట్టు తెలుస్తున్నది.