వాషింగ్టన్: సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తర్వాత త్వరలో సెల్ఫ్ ఫ్లయింగ్ విమానాలు అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికాలో తొలిసారిగా పైలట్ లేకుండా పూర్తిగా స్వయంగా దానికదే నడిచే వ్యవస్థ కలిగిన విమానం 3,199 మైళ్ల దూరాన్ని చుట్టేసింది. ఏరోస్పేస్ సంస్థ జాబీ ఏవియేషన్ నిర్వహించిన సింగిల్- ఇంజిన్ సెస్నా కారవాన్ విమానం రన్‌వేపై ట్యాక్సీయింగ్ నుంచి టేకాఫ్, ల్యాండింగ్, వరకూ అన్ని దశలను దానికదే పూర్తి చేసింది. ఈ విమానం సెప్టెంబర్ 7న కాలిఫోర్నియాలోని కాంకర్డ్‌లో ఉన్న జాబి స్థావరం నుంచి బయలుదేరింది.
ఒకే దశలో నాన్‌స్టాప్‌గా కాకుండా పలు ప్రాంతాల మీదుగా అనేక దశల్లో ప్రయాణించింది. ఈ ప్రయాణంలో పీనిక్స్ డీర్ వ్యాలీ వంటి అత్యంత రద్దీగా ఉండే జనరల్ ఏవియేషన్ విమానాశ్రయాల్లోనూ విమానం దానికదే మార్గాన్ని అనుసరించింది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ఉరుములతో కూడిన వర్షాలు ఎదురైన సమయంలోనూ విమానం రియల్ టైమ్‌లో మార్గాన్ని మార్చుకుంది.