సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ):దోమలగూడలో ముగ్గురు బాలికలు జూలైలో అదృశ్యమైనప్పుడు పోలీసులు 262 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. వారి కదలికలను హైదరాబాద్ నుంచి కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు గుర్తించి రైలులో చత్తీస్‌గఢ్ వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. చివరకు బాలికలను గుర్తించి కుటుంబాలకు అప్పగించారు. మే 31న హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ మిస్సింగ్ అయ్యాడు. కాచిగూడ నుంచి రైలులో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
కుటుంబం అని ఫొటోలు, వివరాలతో సోషల్‌మీడియాలో ప్రచారం ప్రారంభించింది. జూన్4న సింగరాయకొండకు చెందిన వ్యక్తి రాహుల్‌ను గుర్తించి కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. అక్కడి ఓ పాడుబడ్డ బావిలో మృతదేహం లభించిందని తెలిపారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతుడు రాహుల్ అని నిర్ధారించారు. జూబ్లీహిల్స్ జోన్ పరిధి సనత్‌నగర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని మాయమైంది. ఆమె మానసిక పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఒక ప్రబుద్దుడు మాయమాటలతో ఆమెను దూరప్రాంతానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆ విద్యార్థినిని కాపాడారు. ఇలా హైదరాబాద్ నగరంలో ఇంటి నుంచి వెళ్లిన వారు కొందరు తిరిగొచ్చారు..
ఇంకొందరు శవాలుగా తేలారు.. మరికొందరి కోసం కుటుంబాలు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాయి. అమ్మ తిట్టినా, నాన్న మందలించినా.. చదువులు, పరీక్షలు, ప్రేమ, ఆకర్షణ వలకు చిక్కిన మైనర్లు, యువతులు ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు. కుటుంబంలో ఆలుమగల మధ్య కీచులాటలు, వివాహేతర సంబంధాలతో మహిళలు గడప దాటుతున్నారు. హైదరాబాద్‌లో ఒక మనిషి కనిపించకుండా పోయాడు. ఇంట్లో వాళ్లు మొదట బంధువులకు ఫోన్ చేస్తారు.
ఆ తర్వాత స్నేహితులను ఆరా తీస్తారు. మొబైల్‌కు కాల్ చేస్తారు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో చివరకు పోలీసు స్టేషన్ తలుపు తడుతారు. ఫిర్యాదు నమోదవుతుంది. పేరు..వయసు..ఫోటో.. చివరిసారిగా కనిపించిన ప్రదేశం.. మొబైల్ నెంబర్.. ఇలా ప్రతీ వివ రం పోలీసు రికార్డులోకి వెళ్తాయి. కానీ ప్రతీ మిస్సింగ్ కేసు ముగింపు ఒకేలా ఉండదు. కొందరు స్వచ్ఛందంగా వెళ్లిపో యి తిరిగి వస్తారు. కొందరిని పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తిస్తారు. కానీ కొన్ని కేసుల్లో మాత్రం మిస్సింగ్ ఫిర్యా దు వెనకే అసలు నేరం దాగి ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ అది కిడ్నాప్‌గా ఆ తర్వాత హత్యగా మారుతుంది. కొన్ని సా ర్లు మృతదేహం కూడా దొరకదు. నగరంలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒక్కనెలలో 360 కేసులు..!
హైదరాబాద్‌లో ప్రతీ సంవత్సరం 3 నుంచి 4వేల మంది అదృశ్యమవుతున్నట్లు అంచనా. వివిధ రకాల కారణాలతో మహిళలు కనిపించకుండా వెళ్లిపోతుంటే, అనారోగ్యం, మద్యం అలవాటు, ఇతర సంబంధాలతో పురుషులు తమ వారికి దూరంగా వెళ్లిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలో గత ఎనిమిది నెలల సమయంలో 1140 మంది అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి. వీటిలో అధికశాతం కేసులు జూలైలో 360 నమోదు కాగా వీరిలో 170మంది బాలికలు, మహిళలు ఉన్నారు. ఒక్క కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఈ పదిరోజుల్లో ఆరుగురు అదృశ్యమైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో మైనర్బాలికలు కూడా ఉండడం గమనార్హం.
ఇక పాతబస్తీలో మిస్ అయిన బాలికల ఆచూకీ లభించడం చాలా అరుదు కాగా వారి విషయంలో ఎఫ్ఐఆర్లు నమోదవుతూనే ఉంటాయి. గాలింపు చర్యలు ఉన్నప్పటికీ స్థానికంగా సరిగా సహకారం లభించదని స్థానిక పోలీసు అధికారి ఒకరు చెప్పారు. మిస్ అయిన వారి విషయంలో తమకు ఆచూకీ లభ్యమై వారిని తీసుకొని రావడానికి ప్రయత్నించినా రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విషయంలో కుటుంబసభ్యులు, స్థానికుల చొరవ ఉంటే తప్ప వారిని వెనక్కు తీసుకురావడం కష్టమవుతున్నదని ఆయన పేర్కొన్నారు.
అయితే మిస్సింగ్ కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసులు సాంకేతిక ఆధారాలు, వారి కదలికల ద్వారా 70శాతం మందిని ఇంటికి చేర్చినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇటీవల పోలీసుస్టేషన్లకు వెళ్లి వస్తున్న బాలికలు, యువతుల మిస్సింగ్ కేసుల్లో అధిక శాతం ప్రేమ, ఆకర్షణ వలలో చిక్కి మాయమవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మిస్సింగ్ కేసుల్లో ప్రధానంగా మైనర్లకు, యువతులకు సంబంధించి వారి ప్రవర్తన, ఇతర అంశాలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని పోలీసులు కోరుతున్నారు.