చైనా: చైనాలో ప్రజలు తమ ముఖాలను ఏఐ కంటెంట్ కోసం అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. వారి ముఖాలను టీవీ సీరియల్స్, ప్రకటనలు, గేమ్స్ తదితరాల్లో ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు ఒక వ్యక్తి ముఖాన్ని ఉపయోగించినందుకు రూ. 14 లక్షల వరకు చెల్లిస్తున్నాయి. ఒక ప్రకటన సంస్థ ఓ బ్యాంకు ఉద్యోగి ముఖాన్ని మూడు రోజుల్లో ఏడుసార్లు ఉపయోగించింది. అందుకు ప్రతిఫలంగా అతనికి సుమారు రూ. 36,000 చెల్లించింది.
ఒక వ్యక్తి తన ముఖాన్ని రొమాన్స్, కుటుంబ కథనాలకు సంబంధించిన కంటెంట్‌లో ఉపయోగించేందుకు రూ. 1,400 వసూలు చేస్తున్నాడు. ఓ చైనా ప్లాట్ఫామ్లో 370 మంది డిజిటల్ నటుల ప్రొఫైల్స్ ఉన్నాయి. సినిమాలు, మోడలింగ్, యానిమేషన్ గేమ్స్ కోసం వారి ముఖాలను ఎంపిక చేస్తున్నారు. తమ ముఖాన్ని భయానక లేదా లైంగిక కంటెంట్‌లో ఉపయోగించేందుకు వారు నిరాకరించవచ్చు. కంటెంట్‌లో ముఖాన్ని ఉపయోగించేందుకు ఇచ్చే అనుమతి, ఆ ముఖాన్ని ఏఐ శిక్షణ కోసం ఉపయోగించేందుకు ఇచ్చే అనుమతి ఒకటి కాదు. కొన్ని ఒప్పందాల్లో అంగీకరించిన కాలం పూర్తికాకముందే లైసెన్స్‌ను ఉపసంహరించుకుంటే సుమారు రూ. 7.2 లక్షల వరకు జరిమానా విధించే నిబంధనలు కూడా ఉన్నాయి.