ఒక తరం వెళ్లిపోతుంది. మరో తరం వస్తుంది. కానీ, మధ్యలో ఒక అదృశ్యమైన బంధం కొనసాగుతూనే ఉంటుంది. అదే స్మృతి. భారతీయ సంస్కృతి ఈ స్మృతికి ఒక ప్రత్యేక కాలాన్ని కేటాయించింది. అదే పితృపక్షం. మనిషి పుట్టిన రోజును గుర్తు చేసుకుంటారు. పెళ్లి రోజును గుర్తు చేసుకుని సంబురాలు జరుపుకొంటారు. పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కానీ, తన ముందున్న తరాలను గుర్తు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పక్షాన్ని ఏర్పాటు చేసుకున్న అరుదైన సంస్కృతి మనది. భారతీయ సంప్రదాయ దృష్టి కోణంలో పితృపక్షం అనేది మరణించిన వారి కోసమే కాదు.. జీవించి ఉన్న మనిషి తన మూలాలను సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకునే పర్వం.
‘మహాన్ అత్యంత కొలయో యత్ర మహాలయ’ అనేది పురాణోక్తి. మహాలయం అంటే ఘనమైన ముగింపు. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే రోజులను పితృపక్షాలు లేదా మహాలయపక్షం అంటారు. మహాలయ పక్షంలోని అన్ని రోజుల్లో కానీ, ఒక్క మహాలయ అమావాస్య రోజున పూర్వికులను గుర్తు చేసుకుంటూ వారికి పిండప్రదానం చేయడం ముఖ్యమైన విధిగా పాటిస్తారు. ఇది ఒక ఆచారంగా మాత్రమే చూడకుండా పితృపక్షాలలో చేసే క్రియల వెనక శాస్త్రీయత, మనస్తత్వశాస్త్రం, పర్యావరణ స్పృహ దాగి ఉన్నాయని గ్రహించాలి.
శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. తప్పనిసరిగా తీర్చాల్సిన రుణాల్లో పితౄణం ఒకటి. సూర్యుడు కన్యారాశిలో సంచరించే సమయంలో పితృదేవతలకు శ్రాద్ధ ప్రక్రియ నిర్వహించాలని స్కాంద పురాణంలోని నాగర ఖండం చెబుతున్నది. పితృపక్షాల ఆచారానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు కొన్ని పురాణగాథలు చెబుతున్నాయి. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి తినడానికి ఆహారం బదులు బంగారం, నవరత్నాలు లభించాయి. దీనికి గల కారణాన్ని కర్ణుడు ఇంద్రుడిని అడగగా ‘నీవు బతికి ఉన్నప్పుడు బంగారం రూపంలో చాలా దానాలు చేశావు కానీ, నీ పితృదేవతలకు ఎప్పుడూ అన్నం కానీ, నీరు కానీ సమర్పించలేద’న్నాడు.
తన తప్పును తెలుసుకున్న కర్ణుడు తన పితృదేవతలను సంతృప్తి పరచడానికి కొంత సమయం కావాలని ఇంద్రుణ్ని కోరుతాడు. ఆ కోరికను మన్నిస్తాడు ఇంద్రుడు. కర్ణుణ్ని భూలోకానికి పంపగా ఈ పితృపక్షాల సమయంలోనే అతను తన పూర్వికులకు అన్నపానాదులు, తర్పణాలు సమర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. పితృపక్షాల సమయంలో పితృదేవతలకు శాంతి కలిగించడం కోసం శ్రాద్ధం, తర్పణం, దానం అనే మూడు ప్రక్రియలను ఆచరించాలి. పూర్వికులు మరణించిన తిథిని బట్టి ఆయా రోజుల్లో శ్రాద్ధం నిర్వహిస్తారు. ఒకవేళ తిథి తెలియకపోతే మహాలయ అమావాస్య రోజున అందరికీ కలిపి శ్రాద్ధం చేస్తారు. నదులు, చెరువులు, పుణ్యక్షేత్రాలలో నువ్వులు, నీటితో పితృదేవతలకు తర్పణం వదులుతారు. బియ్యప్పిండి లేదా ఉడికించిన అన్నంతో పిండప్రదానం చేయడం ఆనవాయితీ. కాకిని పితృదేవతల స్వరూపంగా భావించి వాటికి ఆహారాన్ని పెడతారు.
ఎందరో శాస్త్రవేత్తలు మహాలయపక్షాల ఆచారాలపై వివిధ కోణాల్లో పరిశోధనలు చేశారు. ఆధునిక సైన్స్ ప్రకారం మన శరీరం మన పూర్వికుల డీఎన్ఏతో నిర్మితమైంది. మనం శారీరకంగా, మానసికంగా ఎలా ఉన్నామనేది మన పూర్వికుల జన్యువులపై ఆధారపడి ఉంటుంది. పరిశోధకుల ప్రకారం పితృపక్షాలు మన ఉనికికి కారణమైన పూర్వికుల డీఎన్ఏకు మనం చెప్పుకొనే ఒకరకమైన జన్యుపరమైన కృతజ్ఞతగా భావిస్తారు.
మరణించిన కుటుంబసభ్యులను తలచుకోవడం, వారి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ద్వారా మానసికంగా కొంత ప్రశాంతత లభిస్తుంది. గ్రీఫ్థెరపీలో భాగంగా ఈ ఆచారాలు పనిచేస్తాయి. పూర్వికుల పట్ల తప్పులు చేసి ఉంటే వారిని క్షమాపణలు కోరడం, వారి మంచి పనులను గుర్తు చేసుకోవడం ద్వారా మానసిక అపరాధ భావన తొలగిపోతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పదిహేను రోజుల్లో కాకులకు, పక్షులకు ఆహారం పెట్టడం తప్పనిసరి ఆచారం కావడం జీవ వైవిధ్య పరిశోధనల ప్రకారం వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యే సంధికాలంలో పక్షులకు సహజసిద్ధమైన ఆహారం దొరకడం కొద్దిగా తగ్గుతుంది. ఆ సమయంలో మనుషులు పెట్టే ఈ ఆహారం పక్షుల మనుగడకు ఎంతో సహకరిస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.
పితృపక్షాలు కేవలం సంప్రదాయ క్రతువులు మాత్రమే కాదు. వాటి వెనుక సమాజహితం, పర్యావరణ పరిరక్షణ, మానసిక ఆరోగ్యం వంటి శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ అని నమ్మే భారతీయ సంస్కృతిలో వారు మరణించిన తర్వాత కూడా వారిపట్ల కృతజ్ఞతతో ఉండటమే ఈ పితృపక్షాల అసలైన అంతరార్థం. మహాలయపక్షంలో వారసులు సమర్పించే తర్పణాలతో పితృదేవతలు సంతోషించి వారి కుటుంబసభ్యులను ఆశీర్వదిస్తారని భారతీయులు విశ్వసిస్తారు. తరాలు మారినా, ఆధునిక విజ్ఞానం ఎంతగా మనతో మమేకమవుతున్నా ప్రతి ఒక్కరూ తమ మూలాలను మరవకూడదనే అద్భుతమైన సందేశాన్ని ఇచ్చేవే ఈ పితృపక్షాలు.
– రంగనాథ్ మిద్దెల 9866573461