హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): వరంగల్ నగరంలోని చరిత్రాత్మక మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించి, దానికి కాకతీయ వీరనారి ‘రాణీ రుద్రమదేవి‘ పేరు పెట్టాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. మామునూరు విమానాశ్రయానికి మంచి పేరు సూచించాలని కోరిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన రాసిన ఐదు పేజీల సమగ్ర బహిరంగలేఖను ఆదివారం మీడియాకు విడుదల చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మామునూరు విమానాశ్రయం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని సీఎం పదేపదే మాట్లాడటం పచ్చి అబద్ధమని, నిరాధార ఆరోపణలతో క్రెడిట్ కొట్టేయాలనే రేవంత్ సరార్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే, 2014 సెప్టెంబర్ 6న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాసి, వరంగల్ సహా రాష్ట్రంలోని మరో 5 చోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కోరారని వినోద్‌కుమార్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోరిక మేరకు మామునూరు సహా ఆరు ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాల కోసం నాటి బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.4.5 కోట్లు చెల్లించి ఓఎల్ఎస్ సర్వే పూర్తి చేయించిందని లేఖలో ప్రస్తావించారు.
ఉడాన్ ద్వారా నిధులివ్వాలన్న కేసీఆర్
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయ ఒప్పందం ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో 2033 వరకు మరో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించలేదని వినోద్‌కుమార్ గుర్తుచేశారు. అయినా నిరాశ చెందకుండా 2020 డిసెంబర్ 12న నాటి పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పురీని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి, ప్రాంతీయ అనుసంధాన పథకం (ఉడాన్) కింద చేర్చి నిధులు ఇవ్వాలని కోరారని తెలిపారు. కేంద్రం నిధులివ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనైనా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సరార్ నాడు సిద్ధపడిందన్న ఆధారాలను లేఖకు జతచేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే వడివడిగా అడుగులు
2021 అక్టోబర్‌లో అప్పటి కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన అధికారిక లేఖను వినోద్‌కుమార్ ఉటంకించారు. ఆ లేఖలో మామునూరులో 748 ఎకరాల ఎయిర్పోర్ట్ భూములు ఉన్నప్పటికీ, ఏటీఆర్ విమానాల రాకపోకలకు రూ.250 కోట్లతో పాటు అదనంగా 27.7 ఎకరాలు, ఎయిర్‌బస్ 320 కోసం రూ.350 కోట్లతోపాటు 334 ఎకరాల భూమి అవసరమని కేంద్ర ప్రభుత్వం పేరొన్న విషయాన్ని గుర్తుచేశారు. జీఎంఆర్ నుంచి ఎన్వోసీ , డీజీసీఏ అనుమతుల కోసం బీఆర్ఎస్ హయాంలోనే వేగంగా అడుగులు పడ్డాయని వివరించారు.
‘అంతా నేనే చేశా’నని రేవంత్ చెప్పుకోవడమేంది?
ప్రస్తుత ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పాత్రను తాము కాదనడం లేదని, కానీ ‘గతం లో ఏమీ జరుగలేదు, అంతా నేనే చేశాను’ అని ఆయన చెప్పుకోవడం రాజకీయ దిగజారుడుతనమని వినోద్‌కుమార్ విమర్శించారు. బీఆర్ఎ స్ హయాంలో ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రుల తో జరిపిన సంప్రదింపులు, సమర్పించిన ప్రతిపాదనలు, అధికారిక ఉత్తర్వులు, వీడియోలు, పత్రికా క్లిప్పింగులను రుజువులుగా లేఖతోపాటు పంపుతున్నట్టు ఆయన వెల్లడించారు.
ఓరుగల్లు ఖ్యాతిని చాటేలా నిర్మాణం జరుగాలి
కాకతీయుల రాజధానిగా విలసిల్లిన ఓరుగల్లు ఖ్యాతిని చాటేలా మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగాలని వినోద్‌కుమార్ కోరారు. అందుకే ఎయిర్‌పోర్ట్‌కు రాణీ రుద్రమదేవి పేరును నామకరణం చేసి ప్రజల ఆకాంక్షను గౌరవించాలని కోరారు. ఉద్దేశపూర్వక అబద్ధాలతో కూడిన ప్రచారాన్ని ఆపి, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆధారాలను పరిశీలించి వాస్తవాలను గుర్తించాలని హితవు పలికారు.
కేసీఆర్ కృషి.. ఇదిగో ఆధారాలు
1) 2014లోనే కేసీఆర్ లేఖ: తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన వెంటనే, వరంగల్ సహా రాష్ట్రంలో మరో 5 విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ 2014 సెప్టెంబర్ 6న నాటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి మోదీకి అధికారిక లేఖ రాశారు.
2) ఫీజిబిలిటీ అధ్యయనాల రుసుము చెల్లింపు: రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, మామునూరు (వరంగల్), బసంత్‌నగర్ (కరీంనగర్), జక్రాన్‌పల్లి (నిజామాబాద్), ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కొత్తగూడెంలో 6 విమానాశ్రయాల సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ.4.5 కోట్ల కన్సల్టెన్సీ చార్జీలు కోరగా, బడ్జెట్లో ఆ నిధులను సమకూర్చి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది.
3) ఓఎల్ఎస్ సర్వే పూర్తి: రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సల్టెన్సీ ఫీజులు అందిన తర్వాత, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓఎల్ఎస్ (అబ్స్టాకల్ లిమిటేషన్ సర్వే) సహా సమగ్ర సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని పూర్తిచేసింది.
4) 150 కి.మీ. నిబంధన కొర్రీ: 2020 మార్చి 3న రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి స్పందిస్తూ మామునూరు విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆస్తి అయినప్పటికీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కి.మీ. పరిధిలో జీఎమ్మార్ ఒప్పందం కింద ఉన్నందున 2033 వరకు కేంద్రం దీని అభివృద్ధికి ఎలాంటి నిధులు ఖర్చు చేయదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో జీఎమ్మార్, ఏఏఐతో నిబంధనలు ఖరారు చేసుకొని అభివృద్ధి జరుపాలని సూచించారు.
5 ) కేంద్ర మంత్రితో కేసీఆర్ భేటీ.. ఉడాన్ ప్రతిపాదన: 2020 డిసెంబర్లో ఢిల్లీ పర్యటన సందర్భంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీతో భేటీ అయ్యారు. ఈ భూమి పూర్తిగా ఏఏఐకి చెందినదేనని, రీజినల్ కనెక్టివిటీ సీమ్ (ఉడాన్) పరిధిలోకి వరంగల్‌ను చేర్చి తగిన చర్యలు వేగవంతం చేయాలని 2020 డిసెంబర్ 12న లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
6) కేంద్రం నుంచి హామీ కరువు.. కన్సల్టెన్సీకి 9% డిమాండ్: కేంద్రం నుంచి సరైన హామీ రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరులతో ముందుకెళ్లాలని భావించింది. 2021 సెప్టెంబర్ 8న ఏఏఐ చైర్మన్ లేఖ రాస్తూ ప్రాజెక్ట్ ఖర్చులో 9శాతం చెల్లిస్తే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అందిస్తామని తెలిపారు తప్ప, ఆర్సీఎస్-ఉడాన్ కింద కేంద్ర నిధులతో నిర్మిస్తామని ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
7) రూ. 600 కోట్ల ఖర్చు రాష్ట్రానిదేనన్న సింధియా: తెలంగాణ సీఎంతో హైదరాబాద్‌లో జరిగిన చర్చల అనంతరం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 2021 అక్టోబర్ 6న లేఖ రాస్తూ వరంగల్ ఎయిర్పోర్ట్ ఏఏఐ పరిధిలోనిదే అయినప్పటికీ, పెద్ద విమానాలు తిరిగేలా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి అయ్యే రూ.600 కోట్ల ఖర్చుతోపాటు అవసరమైన అదనపు భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని స్పష్టంచేశారు.
8) పెట్టుబడికి కేంద్రం నిరాకరణ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అధికారిక వైఖరి ప్రకారం.. మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ లేదా అభివృద్ధికి కేంద్రం ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని
స్పష్టమైంది.
9) బీఆర్ఎస్ సరార్ నిరంతర ఒత్తిడి.. ఏఏఐ సంసిద్ధత: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేపదే పట్టుబట్టడంతో చివరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తన సొంత ఎయిర్‌పోర్టును తానే పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. రన్ వే విస్తరణ, ఆధునీకరణ కోసం అదనపు భూమి ఇవ్వాలని, హైదరాబాద్ జీఎమ్మార్ నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
10 ) రైతుల ప్రయోజనార్థం కేటీఆర్ క్షేత్రస్థాయి పరిశీలన: విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూమి పరిమాణాన్ని ఖరారు చేసేందుకు 2022 మే 7న నాటి రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఏఏఐ అధికారులతో కలిసి మామునూరు ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక రైతుల పట్టా భూములు ఎకువగా కోల్పోకుండా, కనీస స్థాయికి మాత్రమే భూసేకరణ అవసరాలను పరిమితం చేయాలని ఆనాడు ఆయన అధికారులను కోరారు.
11) సొంత నిధులతో చేపట్టేందుకు ఏఏఐ ఆమోదం: చివరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సొంత నిధులతోనే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు అంగీకరించింది. విస్తరణకు అవసరమైన భూమి కో-ఆర్డినేట్లను ధ్రువీకరించేందుకు 2023 జూన్‌లో ఏఏఐ స్థానిక అధికారులు ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపి, భూసేకరణ నిమిత్తం ఆ వివరాలను కలెక్టర్‌కు తెలిపారు.
12) భూసేకరణకు కేబినెట్ ఆమోదం.. ఎన్వోసీ లేఖ: ఏఏఐ నుంచి నిర్దిష్ట కో-ఆర్డినేట్లు అందగానే, బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూలై 31న క్యాబినెట్ తీర్మానం చేసింది. అదనపు భూసేకరణ, డెయిరీఫామ్ భూముల వినియోగం, వరంగల్ విమానాశ్రయ కార్యకలాపాల కోసం జీఎమ్మార్ నుంచి ఎన్వోసీ కోరుతూ లేఖ రాయాలని క్యాబినెట్ ఆమోదించింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అదనపు భూసేకరణ ప్రక్రియ వేగవంతం కాగా, మరో 2 నెలలకే రాష్ట్ర ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.