Sachin Tendulkar : నీట్ పేపర్ లీకేజీపై జవాబుదారీతనం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులకు క్రికెట్ దిగ్గజం సచిన్ లటెండూల్కర్ (Sachin Tendulkar) మద్దతు తెలిపాడు. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కోరుతూ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్న వారికి న్యాయం చేయాలని సూచిస్తూ ఎక్స్‌లో సచిన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. కష్టపడి చదివే విద్యార్థులకు తగిన ప్రతిఫలం లభించే సంస్కృతిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మాస్టర్ బ్లాస్టర్ పేర్కొన్నాడు. తన ఆటతో కోట్లాదిమంది మనసులు గెలుచుకున్న సచిన్.. కేంద్రానికి సూచనలు చేస్తూ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
పోలీసుల లాఠీలకు ఎదురొడ్డి మరీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్న విద్యార్థిలోకానికి మద్దతు వెల్లువెత్తుతోంది. తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ విద్యార్థులకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. స్టూడెంట్స్ తమ కష్టానికి ప్రతిఫలం దక్కనప్పుడు నిరాశకు లోనవుతారు. అప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది అని సచిన్ తెలిపాడు. ఈ సందర్భంగా ప్రొఫెసరైన తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు క్రికెట్ గాడ్.
— Sachin Tendulkar (@sachin_rt) July 23, 2026
‘మా నాన్న ఒక ప్రొఫెసర్. ఆయన ఎంతో మంది విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దారు. నాన్న మాకు నేర్పిన పాఠం ఒకటుంది. ఓడిపోయినా పర్లేదు. కానీ, చీటింగ్ చేయొద్దు. విజయం కోసం దగ్గరి దారులు వెతకొద్దు. సమాజంలో పెద్దవాళ్లుగా అలాంటి ఒక సంస్కృతిని పెంపొందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. కష్టం కంటే ఫలితాలకే ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రతిభను కాదని షార్ట్‌కట్‌లను నమ్ముతారు. ఈ రోజుల్లో విద్యార్థులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కనందుకు నిరాశపడాన్ని అర్ధం చేసుకోగలం.

ఇకపై వారికి అలా అనుకోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన యువ భారతం కలలు, శక్తితో నిండినది. యువత మన విజయానికి ఇంధనం. తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు, బంధువులు, స్కూల్ నిర్వాహకులు.. మనమంతా ఒక సమాజంగా యువతరాన్ని ప్రోత్సహించాలి. శ్రమకు ఫలితం ఉంటుందని, నిజాయతీకి ప్రోత్సాహం దక్కుతుందని, ప్రతిభే గెలుస్తుందనే సంస్కృతిని మనం ఏర్పాటు చేయాలి. మన పిల్లల భవిష్యత్తు, వారి కలలకు రక్షణ కల్పించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొంటామనే నమ్మకం నాకుంది’ అని సచిన్ పేర్కొన్నాడు.