యువ నటుడు శ్రీనందు నటిస్తున్న సినిమా ‘కాసు’. ఇందుకుమార్ కథానాయికగా నటిస్తూ నరేంద్ర కొండతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీఎస్ హర్షవర్థన్ దర్శకుడు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈసినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. అగ్ర నిర్మాత ఏఎం రత్నం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
డబ్బు జబ్బుగా మారితే పర్యావసానం ఎలా ఉంటుందో ఈ సినిమా అద్భుతంగా ఆవిష్కరిస్తుందని, డబ్బు గొప్పతనం తెలిపే సినిమా ఇదని హీరో శ్రీనందు పేర్కొన్నారు. ఈ టీమ్‌ని కథే ఎంచుకున్నదని, ‘కాసు’ మూవీ మీ కాసులకు ఎంత న్యాయం చేస్తుందో త్వరలో తెలుసుకుంటారని కథానాయిక, నిర్మాత ఇందుకుమార్ చెప్పారు. హిల్ స్టేషన్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇదని దర్శకుడు తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్.విహారి, ఎడిటర్ శ్రీనివాస్, వీఎఫ్ఎక్స్ అఖిల్ కూడా మాట్లాడారు.