హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ యాప్‌లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి పంజా విసిరింది. రమ్మీకల్చర్ యాప్, గేమ్స్ క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రమ్మీటైమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన కేసులో తాజాగా రూ.442.35 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను తాతాలికంగా జప్తు చేసింది. వీటిలో గేమ్స్ క్రాఫ్ట్ టెక్నాలజీస్ వాటాదారుల కు టుంబసభ్యులు, ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్టులు, అనుబంధ సంస్థల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్న నగదు నిల్వలు, వాణిజ్య దుకాణాలు, ఓ విల్లా, పలు నివాస భవనాలు ఉన్నట్టు వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు అటాచ్, ఫ్రీజ్, సీజ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.2,843 కోట్లకు చేరినట్టు పేర్కొన్నది. తెలంగాణలోని వివిధ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చేపట్టిన దర్యాప్తులో ఈ ఏడాది మే 7 నుంచి 14 వరకు, జూన్ 20, 21న గేమ్స్ క్రాఫ్ట్ టెక్నాలజీస్ కార్యాలయా లు, సంస్థ డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.
దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది యూజర్లు
మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్, రమ్మీ ఆటలు, టోర్నమెంట్లు ని ర్వహిస్తున్న గేమ్స్ క్రాఫ్ట్, రమ్మీ కల్చర్, రమ్మీ ప్రైమ్, ప్లేషిప్, రమ్మీ టైమ్ ప్లాట్‌ఫామ్‌లకు దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది యూ జర్లు ఉన్నట్టు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వెల్లడించింది. యూజర్లు జమ చేసిన బెట్టింగ్/వేజరింగ్ మొత్తాలపై ప్లాట్‌ఫామ్ ఫీజు కింద ఈ సంస్థలు 10 నుంచి 15 శాతం వ రకు కమీషన్ వసూలు చేసి భారీగా ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌లు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తాయని, ఆటోమేటెడ్ ప్లేయ ర్లు(బాట్లు) ఉండవని ఈ సంస్థలు హామీ ఇచ్చినా వినియోగదారులకు తెలియకుండా బాట్లు, ఆటోమేటెడ్ ప్రోగ్రామ్‌లు, అల్గారిథమ్‌లను ఉపయోగించాయని, దీంతో వారు భారీగా నష్టపోయారని తెలిపింది.