KTR : కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ రాజ్‌పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదలకు సంబంధించిన భూములను లాక్కుంటూ రియల్ ఎస్టేట్ మాఫియాలా పనిచేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో, రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ దౌర్జన్యం కొనసాగుతున్నదని ఆరోపించారు.
హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో, కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా విలేజ్ పేరుతో ప్రభుత్వం పేదల భూములను లాక్కున్నదని కేటీఆర్ విమర్శించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల ఇళ్లు కూలగొట్టిందని, రామగుండంలో దాడికి పాల్పడిందని గుర్తుచేశారు. తాజాగా ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో వెయ్యి మంది పేదవాళ్ల ఇళ్లు కూల్చి రోడ్డున పడేశారని విమర్శించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, వారి బినామీలైన వేజెల్లా సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావుల కోసం, వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, వారి రియల్ ఎస్టేట్ లాభాల కోసం ప్రభుత్వం ఆ వెయ్యి మంది పేదల ఇళ్లను కూల్చిందని, వారికి గూడు లేకుండా చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. వెలుగుమట్లలో జరిగిన ఈ దారుణాన్ని తాను ఆ రోజే ఖండించానని చెప్పారు.
ప్రభుత్వం చేసింద తప్పు అని నాడు ఘంటాపథంగా చెప్పానని, తాను చెప్పింది వాస్తవమే అనేది ఈరోజు తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని ఇప్పుడు బాధితులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపస్తున్నదని తెలిపారు.