Kajal Aggarwal | ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ షూటింగ్ సెట్లో తనకు ఎదురైన ఒక భయంకరమైన సంఘటనను గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ పూర్తయ్యాక తాను క్యారవాన్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా, అదే చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, కనీసం తలుపు కూడా కొట్టకుండా లోపలికి వచ్చేశాడని ఆమె తెలిపారు. ఆ తర్వాత అతడు వెంటనే తన చొక్కా విప్పి, ఛాతీపై ఉన్న కాజల్ పేరు టాటూను చూపించాడని, ఆ హఠాత్ పరిణామానికి తన కాళ్లు చేతులు వణికిపోయాయని కాజల్ వెల్లడించారు.
అభిమానంతో టాటూ వేయించుకోవడం సంతోషమే అయినా, ఒక మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు అనుమతి లేకుండా క్యారవాన్‌లోకి రావడం ఏమాత్రం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంత పెద్ద అభిమాని అయినా ఇటువంటి ప్రవర్తనను ఎంతమాత్రం సహించలేమని, ఇలాంటి పనులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించి అతడిని అక్కడి నుంచి పంపించి వేసినట్లు కాజల్ చెప్పారు. 2004లో హిందీ చిత్రం ‘క్యూన్! హో గయా నా’తో అరంగేట్రం చేసిన కాజల్, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రంతో స్టార్ హీరోయిన్గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్‌మ్యాన్, నాయక్, బాద్షా, ఎవడు, టెంపర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో అలరించడమే కాకుండా బాలీవుడ్లో ‘సింగం’, ‘స్పెషల్ 26’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ఇండియా స్టోరీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.