హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ గడ్డను సస్యశ్యామలం చేసిన నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వ్యక్తిత్వ హననం చేయాలన్న ధ్యేయంతోనే సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్ విచారణ జరిపిందని ఆరోపించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక చట్టవ్యతిరేకమని పేరొంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట బుధవారం కేసీఆర్, హరీశ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు.
ప్రభుత్వ కుయుక్తిని గ్రహించాలి
సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు అనుగుణంగా ఘోష్ కమిషన్ పనిచేయలేదని శేషాద్రినాయుడు చెప్పారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా గత ఏడాది ఆగస్టు 4న మీడియా సమావేశంలో కమిషన్ నివేదిక గురించి పాలక పెద్దలు మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. హైకోర్టు ఆదేశాలు జారీచేసేదాకా కమిషన్ రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టారని, తద్వారా కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర చేశారని ఆరోపించారు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందే మీడియా సమావేశంలో బహిర్గతం చేయడం ద్వారా కేసీఆర్ దోషి అనే భావన కల్పించేందుకు ప్రభుత్వం చేసిన కుయుక్తిని గ్రహించాలని కోరారు. కమిషన్ నివేదికను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వెల్లడించారని, ఇది కేసీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేయడంగా గుర్తించాలని కోరారు.
కమిషన్ నివేదికపై ఏం చేయాలో అసెంబ్లీ నిర్ణయించడానికి ముందే ఇవన్నీ జరిగాయని తెలిపారు. చట్ట ప్రకారం కమిషన్ నివేదిక సమర్పించాక దానిని చట్టసభలో ప్రవేశపెట్టాలని, సభలో చర్చించాకే ఏం చేయాలో తీర్మానం చేయాలని, ఇవేమీ జరగకుండానే మీడియాలో వచ్చేలా పాలక పెద్దలు కుట్ర చేశారని అన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం పనిచేసిందని ప్రకటించాలని కోరారు. జీవో 6 ప్రకారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను జ్యుడీషియల్ ఎంక్వైరీగా ప్రభుత్వం ప్రకటించడం చెల్లదని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా కమిషన్ చర్య ఉన్నదని అన్నారు. నిజనిర్ధారణ చేయాల్సిన కమిషన్ పిటిషనర్ కేసీఆర్‌పై తీవ్ర అభియోగాలు చేయడం చెల్లదని చెప్పారు. ఇతర సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా కమిషన్ తుది నిర్ణయానికి వచ్చే ముందు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్‌లోని సెక్షన్ 8(బీ) ప్రకారం పిటిషనర్ కేసీఆర్‌కు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వలేదని తెలిపారు.
అదే సెక్షన్‌లోని 8(సీ) ప్రకారం అభియోగాలు చేసిన వాళ్లను పిటిషనర్ క్రాస్ ఎగ్జామ్ చేసే వీలు కూడా కల్పించలేదని చెప్పారు. పిటిషనర్‌కు అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విమర్శలకు అనుగుణంగా కమిషన్ ఏకపక్షంగా నివేదిక సమర్పించిందని తెలిపారు. ఆరోపణలు చేసిన వాళ్ల సాక్ష్యాలపై వివరణ ఇచ్చుకునే అవకాశం కేసీఆర్‌కు ఇవ్వకపోవడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని అన్నారు. ఘోష్ కమిషన్ కేసీఆర్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. విచారణ ఏకపక్షంగా జరిగిందని తేల్చాలని విజ్ఞప్తిచేశారు. రాజకీయ పదవిలో ఉన్న కీలక వ్యక్తి కీర్తిప్రతిష్టలు దెబ్బతినేలా జరిగిన కుట్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని అన్నారు. కేవలం కేసీఆర్ పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా (నేమింగ్ అండ్ షేమింగ్) లక్ష్యంగా కమిషన్ విచారణ జరిగిందని చెప్పారు. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. అప్పటివరకు కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ కూడా దర్యాప్తు చేయరాదని ఉత్తర్వులు జారీచేసింది.