మెదక్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఈ యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు 498 కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement) ఏర్పాటు చేశారు. ఇందులో 418 కేంద్రాల ద్వారా 2,49,213 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని సేకరించగా, 80 కేంద్రాల ద్వారా 59,934 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం రూ.717 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా రైతులకు రూ.600 కోట్లు చెల్లించారు. సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున 14,290 మంది రైతులకు రూ.29.97 కోట్ల బోనస్ చెల్లించారు. ఇప్పటి వరకు అన్ని కేంద్రాల్లో సేకరణ ముగియగా 75,371 మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించారు. ఈ సీజన్లో మే నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని మండలాల్లోని సెంటర్ల వద్ద ధాన్యం మొలకలు వచ్చాయి. దీంతో రైతులు చేసేదేమీలేక ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లోనే వడ్లను ఆరబెట్టి తూకం వేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు కనీసం టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచలేదని పలువురు రైతులు ఆరోపించారు.
మెదక్ జిల్లాలో 498 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ కాగా, 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాం సేకరించారు. ఇంకా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. అయితే మొత్తం రూ.648.90 కోట్లు రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రూ.600 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగతా రూ.47.30 కోట్లు బాకీ పడ్డారు. ఇదిలావుండగా 14,290 మంది రైతుల నుంచి సన్నధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 59,934 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించారు. ఇందుకు గాను రూ.29.97 కోట్లు బోనస్ చెల్లించారు.
ఓ వైపు వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే రైతులు దుక్కులు దున్ని తుకాలు పోస్తుంటారు. ఈ సారి ముందుగానే రుతు పవనాలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విత్తనాలను కొనుగోలు చేసి దుక్కులు సిద్ధం చేస్తున్నారు. అయితే మెదక్ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇప్పటికే విత్తనాలను విత్తారు. ఇదిలావుండగా యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. అంతేకాదు రూ.47.30 కోట్ల డబ్బులు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది.
మెదక్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 3.18 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ కాగా, ఇప్పటి వరకు 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని మెదక్ సివిల్ సప్లయ్ డీఎం జగదీశ్వర్ అన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం సేకరణలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా కొనుగోళ్లు వేగంగా పూర్తి చేశాం. ఇప్పటికే రూ.600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మరో రూ.47.30 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు.